ACP | హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : ఓ చర్చికి సంబంధించి రెండు గ్రూపుల మధ్య వివాదాన్ని సెటిల్ చేసేందుకు హైదరాబాద్‌లోని ఓ ఏసీపీ రూ.50 లక్షల లంచం ఒప్పందం చేసుకొని, అడ్వాన్స్‌గా రూ.30 లక్షలు తీసుకొని ఉన్నతాధికారులకు పట్టుబడ్డాడు. సెంట్రల్ జోన్‌లోని ఓ చర్చికి సంబంధించిన సొసైటీ, ట్రస్ట్ మధ్య వివాదం నెలకొన్నది. చర్చి యాజమాన్య హక్కుల విషయంలో 2014 నుంచి కోర్టులో సివిల్ వివాదం కొనసాగుతున్నది. ఈ క్రమంలో ఓ నాయకుడు సొసైటీకి మద్దతు తెలిపాడు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సదరు నాయకుడు ఆ పార్టీ తీర్థం పుచ్చుకొని ప్రత్యర్థి వర్గానికి మద్దతు ప్రకటించాడు. కాంగ్రెస్ నేత అప్పటి వరకు ప్రత్యర్థి పార్టీగా చూసిన ట్రస్టీ వర్గంతో చేతులు కలిపాడు.
చర్చి యాజమాన్య హక్కులను తమ వారికి ఇప్పిస్తే రూ.50 లక్షలు ఇస్తామంటూ డీల్ కుదిర్చి రూ.30 ల క్షలు అడ్వాన్స్‌గా ఇప్పించాడు. స్థానిక ఇన్స్పెక్టర్ను సపోర్టు చేయాలని ఏసీపీ ఆదేశించగా అతను ఒప్పుకోలేదు. ఓ కానిస్టేబుల్‌ను చర్చి వద్దకు పంపించి గేట్ తాళాలు పగలగొట్టించాడు. ప్లాన్ లో భాగంగా కానిస్టేబుల్ డయల్ 100 కు ఫోన్ చేసి తనపై దాడి జరిగిందని ఫిర్యాదు చేశాడు. దీంతో సదరు ఏసీపీ తన సిబ్బందితోపాటు ట్రస్టీ సభ్యులను తీసుకొచ్చి చర్చిగేట్లను తెరిచి లోపలికి వెళ్లాడు. కానిస్టేబుల్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి పలువురిని అరెస్టు చేశారు. ఆ తరువాత అదే జోన్‌లోని మరో పోలీస్స్టేషన్లోనూ కేసు పెట్టించారు. విచారణలో ఏసీపీ రూ.50 లక్షల డీల్ వెలుగులోకి వచ్చింది.