హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 1,44,251 కేసులు పరిషారమైనట్టు సీఐడీ ఏడీజీ చారుసిన్హా వెల్లడించారు. రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ సహకారంతో గతంకంటే 37.14% అధికంగా కేసులు పరిషారమయ్యాయన్నారు. మొత్తం 4,635 సైబర్ క్రైమ్ కేసులను పరిషరించి, బాధితులకు 24.95 కోట్ల నగదు అందజేయగలిగామని చెప్పారు.
వీటితోపాటు 21,388 రాజీ పడదగ్గ ఎఫ్ఐఆర్ కేసులు, 57,343 ఈ-పెట్టీ కేసులు, 60,094 మోటర్ వాహన చట్టం ఉల్లంఘన కేసులు, 791 విపత్తు నిర్వహణ సంబంధిత కేసులు పరిషరించినట్టు తెలిపారు. హైదరాబాద్ యూనిట్ 15,719 కేసుల పరిషారంతో అగ్రస్థానంలో నిలిసినట్టు తెలిపారు.
సైబర్ సెక్యూరిటీ కేసుల్లో టీజీసీఎస్బీ ప్రధాన కార్యాలయం పరిధిలో 87 మంది బాధితులకు రూ. 5.64 కోట్లు తిరిగి ఇప్పించినట్టు సీఎస్బీ డీజీ శిఖా గోయల్ వివరించారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 53,434 మంది బాధితులకు ఏకంగా రూ. 399.06 కోట్ల మొత్తాన్ని రీఫండ్ చేయించినట్టు వెల్లడించారు.