మక్తల్, ఆగస్టు 20 : వ్యవసాయ రంగంపై రేవంత్‌కు ఏ మాత్రం అవగాహన లేదని, రైతులకు అవసరమైన కరెంట్ ఇవ్వడంలో సర్కార్ ఘోరంగా విఫలమైందని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి విమర్శించారు. కరెంట్ ఇవ్వడం చేతకాకపోతే రేవంత్‌రెడ్డి గద్దె దిగాలని డిమాండ్ చేశారు. విద్యుత్తు కోతలను నిరసిస్తూ గురువారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి నారాయణపేట జిల్లా మక్తల్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు.
అంతకుముందు స్థానిక కన్యకా పరమేశ్వరి ఆలయం నుంచి బైక్ ర్యాలీ చేపట్టి అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ కార్యాలయానికి చేరుకొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిట్టెం మాట్లాడుతూ.. సాగుకు సరిపడా కరెంట్ ఇవ్వకపోడంతో రైతులు కండ్లల్లో వత్తులు వేసుకొని.. పొలాల గట్లపై నిద్రాహారాలు మాని పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మక్తల్ నియోజకవర్గంలో చీటికి మాటికి కరెంట్ కోతలు, లోవోల్టేజీ సమస్యతో వ్యవసాయ మోటర్లు కాలిపోతున్నాయని ఆరోపించారు.
కరెంటు సమస్యపై ఏ అధికారికి విన్నవించాలో తెలియక రైతులు ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో వ్యవసాయానికి నిరంతర విద్యుత్తు అందడంతో సాగు సంబురంగా సాగిందని గుర్తుచేశారు. విద్యుత్తు శాఖ ఎస్ఈ వచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని తెగేసి చెప్పారు. విషయం తెలుసుకున్న ఎస్ఈ నవీన్‌కుమార్ హుటాహుటిన అక్కడికి చేరుకొని చిట్టెంతో మాట్లాడారు. లోవోల్టేజీ సమస్యను గుర్తించి, రైతులకు సక్రమంగా విద్యుత్తు సరఫరా చేసేందుకు చర్యలు చేపడుతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.