
ఖమ్మం, సెప్టెంబర్ 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి): పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయాన్ని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌స్వామి.. అహోబిల రామానుజ జీయర్‌స్వామి, దేవనాథ్ జీయర్స్వామిలతో కలిసి శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీవైకుంఠ రామసేవా యాత్రగా భద్రగిరి ప్రదక్షిణను నిర్వహించారు. దీంతో రామనామ స్మరణతో వీధులన్నీ మార్మోగాయి. భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ఆస్థాన పారాయణదారులుగా ఉన్న అంతర్వేది కృష్ణమాచార్యులు రచించిన భాగవతనామకోశం, భారతంలో గీతలు అనే ఆధ్యాత్మిక పుస్తకాలను చినజీయర్‌స్వామి ఆవిష్కరించి.. భక్తులకు ఆధ్యాత్మిక సందేశాన్నిచ్చారు.