హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిపోయింది. ఈశాన్యం నుంచి బలంగా గాలులు వీస్తుండటంతో వారం పది రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఇండ్ల నుంచి బయటికి వెళ్లాలంటే జనం వణికిపోతున్నారు. ఉదయం 9 గంటల వరకు మంచు వీడటం లేదు. పలు జిల్లాల్లో రాత్రి సమయాల్లో తొమ్మిది గంటల తర్వాత వాహనాలు రోడ్లపై రావడం లేదు. పలు జిల్లాల్లో ఏకంగా 6.6 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువగా నమోదవుతున్నాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై తీవ్రంగా ఉండగా, హైదరాబాద్లో 12.5 డిగ్రీలు నమోదైంది. తెలంగాణలోని పలు జిల్లాలలో రాత్రి ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే దిగువకు పడిపోయాయి. రానున్న రోజుల్లోనూ రాత్రి ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉన్నదని తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ తెలిపింది. నగరంలో కొన్ని ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువగా రికార్డ్ అవుతుండగా, హైదరాబాద్లో 11.9 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు పేర్కొన్నది.