హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): చిలుకూరు బాలాజీ ఆలయ ప్రయోజనాల పరిరక్షణకు ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకునేదిలేదనీ ఆలయ పరిరక్షణ ఉద్యమం కన్వీనర్ ఎంవీ సౌందర్‌రాజన్ స్పష్టంచేశారు. ఫిబ్రవరి 9న ఆలయ ప్రాంగణంలో జరిగిన దుర్ఘటన నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలు, కోర్టు పరిధిలో ఉన్న విచారణలపై ప్రకటన విడుదల చేశారు. చిలుకూరు బాలాజీ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా, వ్యవస్థాపకులు ఎవరనే అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నదని చెప్పారు.
ఆలయాన్ని స్వాధీనం చేసుకునేందుకు తాజాగా చిలుకూరు బాలాజీ స్వయంభు కాదని మరో వివాదానికి తెరలేపినట్టుగా తెలిపారు. నిజాం కాలం నాటి దేవాదాయ నిబంధనల ప్రకారం స్వయంభు ఆలయానికి హక్కుదారు మాత్రమే ఉంటారని, తమ పూర్వీకులైన శఠగోపాచారి హక్కుదారుగా ఉన్నారని తెలిపారు. దీనికి చట్టబద్ధత కల్పిస్తూ ముంతఖబ్లో నమోదైన ఎంట్రీలు, వక్ఫ్ డీడ్ కూడా ఉన్నాయని చెప్పారు.
అప్పటి నుంచి తమ పూర్వీకులు మాత్రమే దేవాలయంలో స్వామి వారికి నిత్య కైంకర్య సేవలు చేస్తున్నారని, తరాలుగా తమ కుటుంబ పరిధిలోనే నిర్వహణ, ధర్మకర్త బాధ్యతలు ఉన్నాయని వివరించారు. న్యాయస్థానాల్లో అధార్మికంగా గెలిచేందుకు గుణ్ణాల కుటుంబ సభ్యులు చిలుకూరు బాలాజీ అస్థిత్వాన్ని దెబ్బతీసేలా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో పీవీఆర్కే ప్రసాద్ కమిటీ విచారించిందనీ, దాని ఆధారంగానే 2008లోనే ఎండోమెంట్ నుంచి మినహాయింపు వచ్చిందని వెల్లడించారు.