ముస్తాబాద్, జూలై 24: పకోడి నోట్లో పెట్టుకొని ఊపిరాడక 13 నెలల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం సాయంత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో జరిగింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రానికి చెందిన మారుతి, కవిత దంపతులు. వారికి 13 నెలల కుమారుడు క్రాంతి ఉన్నాడు. ముసురు పడుతుండటంతో పకోడి తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. క్రాంతి ఆడుకుంటూ పకోడిని నోట్లో పెట్టుకొన్నాడు. అది గొంతులో ఇరుక్కొని శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతున్నాడు. దీన్ని గమనించిన తల్లిదండ్రులు దవాఖానకు తరలించేలోపే మృతిచెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. తల్లిదండ్రులు బాలుడిని ఎత్తుకొని రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది.