ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 6: ఆడపిల్ల బరువనుకున్నారో.. అడ్డు అనుకున్నారో గానీ రెండేండ్ల చిన్నారిని చుట్టచుట్టి నడుముకు రాళ్లు కట్టి మరీ కర్కశంగా కాలువలోకి విసిరేశారు. ఈ హృదయ విదారకమైన ఘటన జగిత్యాల జిల్లా రాజేశ్వర్రావుపేటలో బుధవారం వెలుగుచూసింది. ఇబ్రహీంపట్నం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లాలోని నిజామాబాద్-మెట్పల్లి జాతీయ రహదారి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో రాజేశ్వర్రావుపేట శివారులోని ఎస్సారెస్పీ కాలువ వంతెనకు 50 మీటర్ల దూరంలో దుర్వాసన వస్తుండటంతో సమీపంలోని పొలంలో పనిచేస్తున్న రైతు అటుగా వెళ్లి చూడగా.. ఓ చిన్నారి మృతదేహం కనిపించింది. వెంటనే ఇబ్రహీంపట్నం పోలీసులకు సమాచారం అందించాడు. ఎస్సై తన సిబ్బందితో అక్కడికి చేరుకొని చిన్నారి మృతదేహాన్ని బయటకు తీశారు. బాలిక వయసు రెండేండ్లు ఉంటుందని, తువ్వాలలో చుట్టి, తువ్వాలకు తాళ్లతో బండరాళ్లు కట్టి నీటిలో విసిరేసినట్టు తెలుస్తుందని ఎస్సై తెలిపారు. మూడు రోజుల క్రితం ఎస్సారెస్పీ కాలువలో పడేయగా, బాలిక మృతిచెంది శరీరం ఉబ్బి నీటిలో తేలినట్టు ఆయన పేర్కొన్నారు. ప్రాణముండగానే చిన్నారిని కాలువలో పడేసి ఉంటారని భావిస్తున్నట్టు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు.