హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): ఇంటర్మీడియట్ పరీక్షల్లో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లుగా విధులు నిర్వర్తించిన అధ్యాపకులు ఆరునెలలుగా రెమ్యునరేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. కాలేజీ నిర్వాహకులు ఆన్లైన్లో బిల్లుల ఆప్‌లోడ్‌లో చేసిన పొరపాట్లకు రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది శిక్ష అనుభవిస్తున్నారు. ఇంటర్‌బోర్డు చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
తప్పును సరిదిద్దే అవకాశంలేదని బోర్డు అధికారులు చెబుతున్నారని వాపోతున్నారు. మార్చిలో జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలకు 1,532 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఒక్కో సెంటర్లో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు మొత్తంగా 3,064 మంది విధులు నిర్వర్తించారు. పరీక్షలు ముగిసిన వెంటనే సెంటర్ అలాట్ అయిన కాలేజీల నిర్వాహకులు ఇంటర్‌బోర్డు నిర్దేశించిన పద్ధతిలో బిల్లులు పంపిస్తారు. ఇందులో సీఎస్, డీవోలకు చెల్లించాల్సిన ప్రోత్సాహకాన్ని(టీఏ, డీఏలు) పొందుపరుస్తారు. సెంటర్ అలాట్ అయిన కాలేజీల మేనేజ్మెంట్లు చేసిన పొరపాటు ఫలితంగా వందలాది మంది అధ్యాపకులు నష్టపోయే పరిస్థితి తలెత్తింది.
నిర్వాహకులు విధులు నిర్వర్తించిన వారి పేర్లకు బదులు గతంలో పనిచేసిన వారి పేర్లను పంపించడం, ఇంటర్‌బోర్డు నిర్దేశించిన ఫార్మాట్లో వివరాలు నమోదు చేయకపోవడం లాంటి సాంకేతిక కారణాలతో రెమ్యునరేషన్ నిలిపివేశారు. వెయ్యి మంది అధ్యాపకులకు ప్రోత్సాహకం అందలేదని సమాచారం. వీరందరూ బోర్డు చుట్టూ చక్కర్లు కొడుతున్నా ఫలితముండటంలేదని వాపోతున్నారు. కాలేజీల నిర్వాహకులు చేసిన తప్పుకు తాము నష్టపోవాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇంటర్ బోర్డు అధికారులు తప్పిదాన్ని సరిదిద్ది తమ ప్రోత్సాహకాన్ని చెల్లించాలని కోరుతున్నారు.