ఖమ్మం, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ములకలపల్లి/అశ్వాపురం/కొణిజర్ల: రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ పూర్తిచేశామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెం వద్ద నిర్మించిన రెండో పంపుహౌస్‌ను గురువారం ప్రారంభించారు.
అనంతరం ఖమ్మం జిల్లా వైరాలో రూ. 2 లక్షల రుణమాఫీని ప్రారంభించి మాట్లాడారు. రూ.2 లక్షల రైతుల రుణమాఫీకి సంబంధించి రూ.18 వేల కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్టు తెలిపారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో రైతులకు రూ. 2 లక్షల్లోపు రుణమాఫీ చేస్తామని రాహుల్‌గాంధీ ప్రకటించిన ప్రకారం అర్హులందరికీ రుణమాఫీ చేశామని వివరించారు.
సీతారామ ప్రాజెక్టును 2026 ఆగస్టు 15 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. ఖమ్మం జిల్లా ప్రజలకు మున్నేరు నుంచి తాగునీటిని అందించేందుకు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ వద్ద 15 టీఎంసీల సామర్థ్యంతో వీరభద్రుడి రిజర్వాయర్ నిర్మిస్తామని ప్రకటించారు. ఇప్పటికే 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని, ఇకపై ఏటా 60 వేల ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు.
హరీశ్ రాజీనామా చెయ్
ఆగస్టు 15 నాటికి రుణమాఫీ పూర్తిచేస్తే శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తానని సవాలు విసిరిన హరీశ్‌రావు వెంటనే రాజీనామా చేయాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు గెలిచినా ఈ రాష్ర్టానికి బీజేపీ గాడిద గుడ్డు ఇచ్చిందని విమర్శించారు. సీతారామ సహా ఎస్ఎల్బీసీ, పాలమూరు ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసే బాధ్యత తమదేనని పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడే ప్రాజెక్టును ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.
అభివృద్ధిపై చర్చకు సిద్ధం
అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద తొలి పంపుహౌస్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ములకలపల్లి మండలం కమలాపురం వద్ద మూడో పంపుహౌస్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టులతోపాటు ఏ ప్రభుత్వ హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో చర్చించాలన్న బీఆర్ఎస్ సవాళ్లకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
వామపక్ష నాయకుల నిరసన
భద్రాద్రి జిల్లాకు చెందిన సీతారామ ప్రాజెక్టు సాగునీటిని తొలుత ఈ జిల్లాకు ఇచ్చాకే ఇతర జిల్లాలకు తరలించాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. పోడు భూములకు పట్టాలలివ్వాలని కోరుతూ ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం గుబ్బగుర్తి అటవీ ప్రాంత రైతులు సీఎం సభలో నినాదాలు చేశారు. పట్టాలు ఇవ్వాలని నినాదాలు చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. దీంతో వారు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. తమ సమస్య సీఎం దృష్టికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఐదు నిమిషాలే ఎత్తిపోసిన ఒకటో పంపుహౌస్
భద్రాద్రి జిల్లాలోని సీతారామ ప్రాజెక్టులో ముఖ్యమంత్రి, మంత్రులు గురువారం ప్రారంభించిన పంపుహౌసుల్లో ఒకటి కేవలం ఐదు నిమిషాలు మాత్రమే గోదావరి నీటిని ఎత్తిపోసింది. మిగతా రెండు గంటకు పైగానే నీటిని లిఫ్ట్ చేశాయి. సీతారామ ప్రాజెక్టు ఎత్తిపోతల పథకంలో తొలుత భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద ఒకటో పంపుహౌస్‌ను మంత్రి కోమటిరెడ్డి ప్రారంభించారు. ఇది కేవలం ఐదు నిమిషాలు మాత్రమే గోదావరి నీటిని ఎత్తిపోసి ఆ తరువాత ఆగిపోయింది. పూసుగూడెం, కమలాపురం పంపుహౌస్‌లు మాత్రం గంటకు పైగానే నీటిని ఎత్తిపోశాయి.