హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీల కార్యాచరణకు పూనుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. సంబంధిత శాఖల మంత్రులు, అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మంత్రి జగదీశ్‌రెడ్డికి సూచించారు. మునుగో డులో గెలిచిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సోమవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. తనకు అవకాశమిచ్చి, విజయాన్ని అందించిన సీఎం కేసీఆర్‌కు కూసుకుంట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కూసుకుంట్లకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం.. శాలువాతో సత్కరించి దీవించారు.
మునుగోడు అభ్యర్థి విజయం కోసం కృషి చేసిన పార్టీ నేతలను సీఎం కేసీఆర్ అభినందించారు. పార్టీ మీద, నాయకత్వం మీద విశ్వాసంతో మునుగోడు ప్రజలు టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించారని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కార్యాచరణలో పెట్టేందుకు పూనుకోవాలని సూచించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రి జీ జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో ప్రజాప్రతినిధులు, పలువురు పార్టీ నేతలు సీఎం కేసీఆర్‌ను కలిశారు. సీఎంను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, గొంగిడి సునీత, బొల్లం మల్లయ్యయాదవ్, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, సైదిరెడ్డి, రవీంద్రకుమార్‌నాయక్, భాస్కర్‌రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, యెగ్గె మల్లేశం, ఎంసీ కోటిరెడ్డి, పార్టీ నేత సోమ భరత్‌కుమార్, ఉమామాధవరెడ్డి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు దూదిమెట్ల బాలరాజు యాదవ్, మేడె రాజీవ్‌సాగర్, ఎం సందీప్‌రెడ్డి, మందాడి సైదిరెడ్డి, చాడా కిషన్‌రెడ్డి, వేంరెడ్డి నర్సింహారెడ్డి, శంకర్ ఉన్నారు.
అబిడ్స్: మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశంతోపాటు కురుమ సంఘం నాయకులు సీఎం కేసీఆర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వీరితోపాటు మునుగోడు విజేత కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా యెగ్గె మల్లేశం మాట్లాడుతూ.. రాష్ట్రంలో కురుమల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు చేపట్టారని వివరించారు. కురుమల కోసం సీఎం మరిన్ని సంక్షేమ పథకాలు తీసుకొస్తారని, నామినేటెడ్ పదవుల్లో కురుమలకు తగిన ప్రాధాన్యం కల్పిస్తారనే ఆశాభావం వ్యక్తంచేశారు. సీఎంను కలిసినవారిలో కురుమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎక్కాల కన్నా, రాష్ట్ర కురుమ యువత అధ్యక్షుడు తూమ్కుంట అరుణ్‌కుమార్, నాయకులు క్యామ మల్లేశ్, సెవెల్లి సంపత్, మంగ వెంకటేశ్ తదితరులు ఉన్నారు.