హైదరాబాద్, సెప్టెంబర్12(నమస్తే తెలంగాణ) : నిజామాబాద్ జిల్లా రెంజల్‌కు చెందిన శ్రీశ్వాన్ మరలాక్షరి వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్‌లో బ్రాంజ్, ఏసియన్ గేమ్స్‌లో గోల్డ్‌మెడల్స్ సాధించాడు. ఇటీవల ఎంసెట్‌లో 15వేల ర్యాంకు రాగా, స్పోర్ట్స్ కోటాలో టాప్ కాలేజీలో సీటు వస్తుందని కౌన్సెలింగ్‌కు హాజరయ్యాడు. కానీ, సాంకేతిక విద్యామండలి తిరస్కరించింది. హైకోర్టును ఆశ్రయించగా స్పోర్ట్స్ కోటాకు అర్హుడని ఆదేశాలిచ్చింది. అయినా అధికారులు పట్టించుకోకుండా టాప్ కాలేజీల్లో సీట్లు భర్తీ అయ్యాయని, తక్కువస్థాయి కాలేజీల్లో సీటు ఇస్తామని మెలికపెడుతున్నట్టు శ్రీశ్వాన్ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్జీఎఫ్లో రాణించిన వారికి స్పోర్ట్స్ కోటాలో టాప్ కాలేజీల్లో సీటు ఇచ్చారని ఆరోపించారు. తమ కుమారుడికి న్యాయం చేయాలని కోరుతున్నారు.