ఏటూరునాగారం, డిసెంబర్ 22 : చెల్పాకలో ఈ నెల ఒకటిన జరిగిన ఎన్కౌంటర్ బూటకమని, మావోయిస్టులను ముందుగా అదుపులోకి తీసుకుని అన్నంలో విషంపెట్టి చిత్రహింసలు గురి చేసి కాల్చి చంపారని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి నారాయణ, ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు చిలుక చంద్రశేఖర్ ఆరోపించారు. ఎన్కౌంటర్లపై సిట్టింగ్ జడ్డిచే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆదివారం ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చెల్పాకలో జరిగిన ఎన్కౌంటర్ స్థలాన్ని పౌరహక్కుల సంఘం నిజ నిర్ధారణ కమిటీ సందర్శించినట్టు తెలిపారు. ఇన్ఫార్మర్ సమాచారంతో అన్నంలో విషంపెట్టి, కాల్చి చంపినట్టు శవాలను చూస్తే అర్థమవుతుందన్నారు. వాగులోని ఇసుకలో నాలుగు మృతదేహాలు పడి ఉన్నాయని, డెన్ మీద అటాక్ చేస్తే వాగులో శవాలు ఎలా ఉంటాయని ప్రశ్నించారు. గత ఏడాది కాలంలోనే రఘునాధపాలెం, దామెరతోగు, చెల్పాక లో ఎన్కౌంటర్లు జరిగి 16 మంది చనిపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. దండకారణ్యంలో ఇప్పటి వరకు 217 మంది ఎన్కౌంటర్లలో చనిపోయారని, వీటన్నింటిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తాము వస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు కొందరిని తమపైకి ఉసిగొల్పుతూ తమ దిష్టిబొమ్మలను దహనం చేయిస్తున్నారని ఆరోపించారు.