హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తేతెలంగాణ): మానవ శరీరంలో పేరుకుపోతున్న మైక్రోప్లాస్టిక్స్ అవశేషాలను ‘చింతగింజల గుజ్జు’తో తొలగించవచ్చని భారతీయ మూలాలున్న అమెరికన్ శాస్త్రవేత్త డాక్టర్ రజనీశ్రీనివాసన్ వెల్లడించారు. టెక్సాస్‌లోని టార్లెటాన్ స్టేట్ యూనివర్సిటీలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న ఆయన మైక్రోప్లాస్టిక్స్ అవశేషాల నియంత్రణపై పరిశోధనలు చేపట్టారు.
తన పరిశోధన ఫలితాలను ఆయన శుక్రవారం ఎక్స్ వేదికగా వెల్లడించారు. భారతదేశంలో గత ఏడాది జరిపిన ఒక పరిశోధన ప్రకారం.. చింతగింజల గుజ్జు మానవ శరీరం నుంచి మైక్రోప్లాస్టిక్‌లను తొలగించడంలో సహాయపడినట్టు తెలిపారు. ప్రయోగశాలలో జరిపిన పరిశోధనలలో నీటిలో నెలకొన్న మైక్రోప్లాస్టిక్స్ నమూనాలలో 90 శాతం వరకు తొలగిపోయినట్టు పేర్కొన్నారు.
చింతగింజలలో ఉండే జిగట సహజ సమ్మేళనాలు మానవ రక్తం, ఊపిరితిత్తులు, జరాయువులలోని మైక్రోప్లాస్టిక్ కాలుష్యం సమస్యను తగ్గించడానికి ఒక ఆశాజనకమైన, ఆహార ఆధారిత విధానాన్ని అందిస్తాయని వివరించారు. దీనిపై ఇంకా విస్తృతంగా పరిశోధనలు జరగాల్సి ఉన్నదని తెలిపారు. ఫ్లోరైడ్ ప్రభావాన్ని ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో చింతగింజల గుజ్జు ప్రభావితంగా పనిచేస్తున్నదని తెలిపారు. తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యపై జరిగిన పరిశోధనల్లో కూడా ఈ విషయం స్పష్టమైందని పేర్కొన్నారు.