హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): మంచినీటి చేపల్లో వ్యాధుల నియంత్రణకు కొత్తగా వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నది. హైదరాబాద్ కేంద్రంగా వెటర్నరీ, హ్యూమన్ ఇమ్యూనిటీపై అధ్యయనం చేసే ఇండియన్ ఇమ్యూనోలాజికల్ సంస్థ (ఐఐఎల్) చేపల కోసం వ్యాక్సిన్ ఉత్పత్తి చేయనున్నది. దేశంలోనే తొలిసారిగా ఆక్వాకల్చర్ వ్యాధుల నియంత్రణకు చేపల వ్యాక్సిన్ తయారీలో పరిశోధనలు చేపట్టనున్నది. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ ఎడ్యుకేషన్ (సీఐఎఫ్ఈ), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్ సంస్థలతో కలిసి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయనున్నది. దీంతో చేపల పెంపకంలో బ్యాక్టీరియాతో వచ్చే వ్యాధులను అరికట్టే అవకాశం ఉంటుంది.
వ్యాధులతో దిగుబడిపై ప్రభావం
దేశంలో ఆక్వాకల్చర్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ కారణంగా దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతున్నది. ఇతర కారణాలతో సంక్రమించే వ్యాధులతో తీవ్ర నష్టాలను ఎదుర్కొవాల్సి వస్తున్నది. ఈ క్రమంలోనే రోగ కారకాలను తట్టుకొని, సేంద్రియ ఎరువులతో చేపల పెంపకానికి వీలుగా వ్యాక్సిన్ డెవలప్ చేసేందుకు ఐఐఎల్ సిద్ధమైంది. అంతర్జాతీయంగా చేపల ఉత్పత్తిలో భారత్ మూడో స్థానంలో ఉండగా.. చేపలకు వ్యాక్సిన్ తప్పనిసరిగా మారింది. ప్రస్తుతం చేపల పెంపకంతో 2.8 కోట్ల మంది ప్రయోజనం పొందుతుండగా, ఎగుమతుల ద్వారా 7.76 బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతున్నది.
వ్యాక్సిన్ల భాండాగారంగా ఐఐఎల్
మానవ, జంతు సంబంధ వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడంలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఐఐఎల్ కీలకపాత్ర పోషిస్తున్నది. ఇప్పటివరకు పోరోసిన్, సిస్టిస్కోరోసిస్, ఎఫ్ఎండీ+హెచ్ఎస్+బీక్యూ, థైలేరియా వ్యాక్సిన్లను ఈ సంస్థ అభివృద్ధి చేసింది. రానున్న రోజుల్లో చేపల పెంపకం, ఆక్వా బిజినెస్ అభివృద్ధికి అవసరమైన మరిన్ని పరిశోధనలు చేయనున్నట్టు ఐఐఎల్ ఎండీ డాక్టర్ కే ఆనంద్‌కుమార్ తెలిపారు. ఆక్వా రంగంలో ఎదురవుతున్న సవాళ్లను తాజాగా డెవలప్ చేయనున్న వ్యాక్సిన్ మెరుగైన పరిష్కారం చూపుతుందని వెల్లడించారు.