(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): మధుమేహులు తమ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి రోజూ ఫింగర్ ప్రిక్ టెస్ట్ (చేతి వేలు మొనకు సూదితో గుచ్చడం) చేసుకొంటుంటారు. శారీరకంగా ఇది ఎంతో నొప్పిని కలుగజేస్తుంది. అయితే, ఇలాంటి బాధలేకుండా సింగపూర్‌లోని నాన్యాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ (ఎన్టీయూ) పరిశోధకులు మధుమేహులకు శుభవార్త చెప్పారు. మనిషి స్వేదం ఆధారంగా శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలను ఇట్టే పసిగట్టే వినూత్న లేజర్ బ్యాండేజీని తీసుకొచ్చారు. మైక్రోలేజర్ టెక్నాలజీతో తయారు చేసిన సాఫ్ట్ హైడ్రోజెల్ ఫిల్మ్‌ను ఈ ప్లాస్టర్‌లో అమర్చారు. శరీరంమీద ఏర్పడే చెమటను సెన్సర్లతో విశ్లేషించే ఈ లేజర్ బ్యాండేజీ.. గ్లూకోజ్ స్థాయిలను కచ్చితత్వంతో వెల్లడిస్తుంది. తద్వారా షుగర్వ్యాధి ఉన్నవారు ఈ బ్యాండేజీ సాయంతో ఎలాంటి నొప్పిలేకుండానే రక్తంలోని తమ గ్లూకోజ్ స్థాయిలను ఇట్టే తెలుసుకోవచ్చు. కాగా, మనిషి స్వేదంలో జీవక్రియలకు కీలకమైన గ్లూకోజ్, లాక్టేట్, యూరియా ఉంటుందన్న విషయం తెలిసిందే.
సూది పరీక్షకు ప్రత్యామ్నాయంగా చెమట ద్వారా గ్లూకోజ్ స్థాయిలను నిర్ధారించే సెన్సర్ ఆధారిత ప్రత్యేక డివైజ్‌ను ఇప్పటికే పరిశోధకులు తీసుకొచ్చారు. అయితే, ధర ఎక్కువ కావడం, తరుచూ ఆ పరికరాన్ని శరీరానికి తగిలించుకోవడం ఇబ్బందిగా మారింది. అయితే, తాము తీసుకొచ్చిన ప్రత్యేక బ్యాండేజీతో ఆ ఇబ్బందులు ఏమీ ఉండబోవని ఎన్టీయూ పరిశోధకులు చెబుతున్నారు. గ్లూకోజ్ రీడింగ్స్‌ను చేతికి ఉండే స్మార్ట్‌వాచీలో కూడా చూడొచ్చని, దీనికి బ్యాండేజీలోని సెన్సర్లు సాయపడుతాయని తెలిపారు.