హైదరాబాద్, జనవరి 24 (నమస్తేతెలంగాణ) : దేశవ్యాప్తంగా ఆర్టీసీలను నిర్వీర్యం చేసి, కార్పొరేట్ కంపెనీలకు లాభాలు గ్యారెంటీ చేసేందుకు కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని టీజీఎస్ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్ ప్రధాన కార్యదర్శి వీఎస్ రావు, ఎస్‌డబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి కే రాజిరెడ్డి విమర్శించారు. ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సుల కోసం కేంద్రప్రభుత్వం రూపొందించిన స్కీంలను సవరించాలని, ఆర్టీసీకే నిధులు, సబ్సిడీలు ఇవ్వాలని సూచించారు. విద్యుత్ బస్సులు కొనుగోలు చేసి, ఆర్టీసీయే నిర్వహించేలా మార్పులు చేయాలని కోరారు. టీజీఎస్ఆర్టీసీ స్టాఫ్, వర్కర్స్ ఫెడరేషన్(సీఐటీయూ), స్టాఫ్ వర్కర్స్ యూనియన్(ఐఎన్టీయూసీ) ఆధ్వర్యంలో రెండు రోజుల నిరసనలో భాగంగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు.