హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): మునుగోడు నియోజకవర్గంలో బీజేపీకి షాక్ తగిలింది. ఇటీవల ఆ పార్టీలో చేరిన చండూరు జడ్పీటీసీ సభ్యుడు కర్నాటి వెంకటేశం తిరిగి టీఆర్ఎస్లో చేరారు. తనను బీజేపీ నేతలు ఒత్తిడి చేసి, బలవంత పెట్టి బీజేపీలో చేర్చుకొన్నారని చెప్పారు. మంగళవారంఆయన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ను హైదరాబాద్‌లో కలిశారు.
చండూరులో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని మంత్రికి వినతిపత్రం సమర్పించారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే సమస్యల పరిష్కారానికి ఆదేశాలు ఇస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. బీజేపీలో చేరిన తర్వాత తాను మానసిక వేదనకు గురయ్యానని, ఇప్పుడు తిరిగి సొంతింటికి వచ్చినట్టుందని వెంకటేశం పేర్కొన్నారు. కేటీఆర్‌ను కలిసిన వారిలో తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్, తెలంగాణ మెడికల్ ఇన్‌ఫ్ట్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఉన్నారు.