హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): అతి త్వరలో పోలీసు కొలువుల జాతర మొదలు కాబోతున్నది. మరికొన్ని రోజుల్లోనే భారీ సంఖ్యలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. మొత్తం 16 వేల పైచిలుకు పోస్టులు భర్తీ చేయనుండటంతో పోలీసు ఉద్యోగార్థుల్లో ఉత్సాహం కనిపిస్తున్నది. హోంశాఖకు సంబంధించి కొన్ని పోస్టుల భర్తీకి ఇప్పటికే ఆర్థికశాఖ అనుమతులు వచ్చాయి. మిగిలిన వాటికి కసరత్తు ముమ్మరంగా కొనసాగుతున్నది. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే ఏమాత్రం ఆలస్యం లేకుండా వెనువెంటనే నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) సిద్ధంగా ఉన్నది.
తొలుత కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. గతంలో మాదిరిగానే ఈ ఏడాది దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్లైన్ విధానంలోనే పూర్తి చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు నియామక మండలి వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకొనేందుకు ఒక యూజర్ ఐడీ, పాస్వర్డ్ను ఇస్తారు. ఇదే ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రతి దశలో సమాచారం తెలుసుకొనేందుకు ఉపయోగపడుతుంది. ఈ ఏడాది 7 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.