హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణను చేపట్టినా ఆ ఫలాలను అర్హులు అందుకోలేని దుస్థితి నెలకొన్నది. అనేక కులాలకు అధికారులు కులధ్రువీకరణ పత్రాలను సక్రమంగా జారీ చేయడం లేదు. ఆయా కులాలకు సర్టిఫికెట్లను జారీ చేసే అధికారాలను కలెక్టర్, ఆర్డీవోలకు కట్టబెట్టారు. అవగాహన లేని వెనుకబడిన ఎస్సీ కులాలు, ఉపకులాలు తమ హక్కులను కోల్పోతున్నాయి. దూరభారం, ఆర్థిక భారం భరించలేక నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు కులధ్రువీకరణ పత్రాలు పొందుతున్న దుస్థితి నెలకొన్నది. సరైన కులధ్రువీకరణ పత్రాలులేక విద్యా, ఉపాధి అవకాశాలను ఉపకులాలు కోల్పోతున్నాయి. ఎస్సీ రిజర్వేషన్ ఉపవర్గీకరణ చేపట్టిన ప్రభుత్వం.. క్యాస్ట్ సర్టిఫికెట్ల జారీ నిబంధనల సడలింపుపై దృష్టి సారించకపోవడం పట్ల ఎంబీఎస్సీ సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాల జాబితాలో మొత్తం 59 కులాలను గుర్తించారు. అందులో మాల, మాదిగ, 57 అత్యంత వెనుకబడిన ఎస్సీ కులాలు ఉన్నాయి. సమైక్య రాష్ట్రంలో 12 ఎస్సీ కులాలకు మాత్రమే కులధ్రువీకరణ పత్రాలను జారీ చేసే అధికారాలను తహసీల్దార్‌కు కల్పించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ ప్రభుత్వం జీవో 11 ద్వారా మరో 6 ఎస్సీ కులాలకు తహసీల్దార్ ద్వారా కులధ్రువీకరణ పత్రాలను జారీ చేసేలా నిబంధనలను మార్చింది. ప్రస్తుతం 18 ఎస్సీ కులాలకు మాత్రమే తహసీల్దార్ ద్వారా కులధ్రువీకరణ పత్రాలు జారీ అవుతున్నాయి. ఎస్సీ జాబితాలోని ఒక కులం ‘బరికి’కి కలెక్టర్ కుల ధ్రువీకరణపత్రాలను ఇవ్వాలి. మిగిలిన 40 ఎస్సీ కులాలకు ఆర్డీవో కులధ్రువీకరణ పత్రాలను జారీ చేయాలని నిబంధనలు ఉన్నాయి.
కలెక్టర్, ఆర్డీవో స్థాయి నుంచి సర్టిఫికెట్లను పొందడమనే నిబంధనలతో ఎస్సీ ఉపకులాల వాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. వెనుకబాటు, సంచార జీవనం కారణంగా ఆర్డీవో, కలెక్టర్ నుంచి కుల, స్థానికత, జనన ధ్రువీకరణ పత్రాలు పొందడం సవాల్‌గా మారుతున్నది. వీఆర్వో నుంచి ఆర్డీవో వరకు అనేక స్థాయిల్లో పరిశీలనలు పూర్తి చేసేందుకు ఎక్కువ సమయం పడుతున్నది. వ్యవప్రయాసల కారణంగా 40 ఎస్సీ కులాల వాళ్లు తమ కులం పేరు మీదుగా ధ్రువీకరణపత్రాలు తీసుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తప్పుడు కుల ధ్రువీకరణ పత్రం పొందితే శిక్షించాల్సిన అధికారులే తప్పులను ప్రోత్సహిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రంలో ఎస్సీలకు 15శాతం రిజర్వేషన్ అమలవుతున్నది. ఎస్సీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలనే చట్టం చేసి అమల్లోకి తీసుకువచ్చింది. షెడ్యూల్డ్ కులాలను 3 గ్రూపులుగా విభజించింది. 3 గ్రూపుల్లోనూ అర్హత కలిగిన అభ్యర్థులు లేకపోతే ఆ ఖాళీలను క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. రిజర్వేషన్ ఫలాలను పొందాలంటే ఆ మేరకు కులధ్రువీకరణ పత్రం పొందాల్సి ఉంటుంది. కానీ కఠినతరమైన నిబంధనలతో 41 ఎస్సీ కులాలు ధ్రువీకరణపత్రం పొందలేకపోతున్నారు. దీంతో ఆ కులాల ప్రజలు ఉద్యోగ, ఉపాధి, విద్య, సంక్షేమ పథకాలకు దూరమయ్యే దుస్థితి నెలకొంది.
ప్రభుత్వ తీరుతో వర్గీకరణ చేసినా ఆ ఫలాలు ఉపకులాలకు అందని పరిస్థితి ఉందని ఉపకులాల ప్రతినిధులు వాపోతున్నారు. కులధ్రువీకరణపత్రాల జారీకి నిబంధనలు సడలించాలని ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. షమీమ్ అక్తర్ కమిషన్‌కు, మంత్రి ఉత్తమ్ నేతృత్వంలోని క్యాబినెట్ సబ్‌కమిటీకి ఇదే విషయాన్ని విన్నవించారు. సర్కారు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఎస్సీల కులధ్రువీకరణ పత్రాల జారీ నిబంధనలను ప్రభుత్వం సడలించాలి. అన్ని ఎస్సీ కులాలకు తహసీల్దార్ ద్వారానే ధ్రువీకరణపత్రాలు మంజూరు చేయాలి. ఎవరూ తప్పుడు ఎస్సీ సర్టిఫికెట్స్ పొందకుండా చర్యలు తీసుకోవాలి. దరఖాస్తుదారుల తండ్రి, అతని కుల ఆచారాలు, కుటుంబ వృత్తి వివరాలపై స్థానిక ప్రజల సమక్షంలో విచారణ జరపాలి. ఆ తర్వాతనే కులధ్రువీకరణ పత్రాలను జారీ చేయాలి. – బైరి వెంకటేశ్, ఎంబీఎస్సీ కులాల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు