హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 21 (నమస్తే తెలంగాణ): ‘ప్రతి సంవత్సరం గోదావరిలో వృథాగా 3వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి. అందులో 200 టీఎంసీలు బనకచర్ల కింద మేం వాడుకుంటే ఎవరికైనా ఎందుకు అభ్యంతరం ఉండాలి’ అని చంద్రబాబు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. సాధారణంగా ఎవరైనా ఇది వింటే నిజమే కదా! అనుకుంటారు. కానీ ఇందులోనే అసలు మర్మం దాగి ఉందని చంద్రబాబుకూ తెలుసు. వాస్తవానికి గోదావరి బేసిన్లో ఇన్‌ఫ్లోలు (వరద) ఏడాది పొడవునా స్థిరంగా ఉండవు, డైనమిక్‌గా ఉంటాయనేది సాగునీటి రంగ నిపుణులు మొదటి నుంచి చెప్తారు. ఇందుకు ఆధారంగా గతంలో కేంద్ర జల సంఘం 1966-67 నుంచి 2012-13 వరకు గోదావరిలోని వరదలపై ఒక విశ్లేషణ చేసింది. ఈ 47 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం నెలవారీగా గోదావరిపై పలు ప్రాంతాల్లో ఎన్ని జలాలు పోయాయనేది లెక్కించింది.
ఇందులో భాగంగా పెరూర్, పోలవరం దగ్గర ప్రవహించిన జలాల సరాసరిని పరిగణలోనికి తీసుకుంది. దీని ప్రకారం పెరూర్ దగ్గర 47 ఏండ్లలో సరాసరిన 2,430 టీఎంసీల జలాలు పారాయి. పోలవరం వద్ద ఈ 47 సంవత్సరాల్లో సరాసరిన 2,638.1 టీఎంసీల వరద నమోదైంది. ఇందులో కేవలం జూలై నుంచి అక్టోబర్ వరకు అంటే నాలుగు నెలల్లోనే 70-80 శాతం ఇన్‌ఫ్లోలు నమోదయ్యాయి. అంటే పోలవరం వద్ద నుంచి సముద్రంలోకి పోయే వరద 2,638 టీఎంసీలనే లెక్కలోకి తీసుకున్నా ఇందులో 80 శాతం అంటే 2,110 టీఎంసీలు జూలై నుంచి అక్టోబర్ వరకుండే నాలుగు నెలల్లోనే చెల్లిపోతాయి. అంటే ఏడాదిలో 8 నెలలకు మిగిలేవి 527 టీఎంసీలు మాత్రమే. అంటే సగటున నెలకు 65 టీఎంసీలే. అంటే వర్షాకాలంలోనే భారీ ఎత్తున వరదలు రావడం, తదుపరి ఎనిమిది నెలల్లో మోస్తరు, స్వల్ప ఇన్‌ఫ్లోలు ఉంటాయనేది దీని ద్వారా అర్థమవుతుంది. జూలై-అక్టోబరు వరకు వర్షాలు కురుస్తుంటాయి.
రిజర్వాయర్లు, చెరువులు అన్నీ నీటితో నిండుగా ఉంటాయి. భూగర్భజలాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఈ క్రమంలో ప్రాజెక్టుల ద్వారా ఎత్తిపోతల అనేది ఉండదు. అందుకే మిగిలిన ఎనిమిది నెలలే అత్యంత కీలకం. ముఖ్యంగా వర్షాకాలం పంటలు ముగిసిన తర్వాత జలాశయాల్లో నీటిమట్టం తగ్గుతుంది. తదుపరి యాసంగి పంటలకు సాగునీరు కావాలి. అప్పుడు సాగునీటి ప్రాజెక్టుల ద్వారా నదిలో ఉండే మోస్తరు, స్వల్ప ఇన్‌ఫ్లోలను ఎత్తిపోసుకోవాలి. చంద్రబాబు చెప్పే బనకచర్ల ప్రాజెక్టు నుంచి కూడా వర్షాకాలంలో నీటి మళ్లింపు అనేది ఉండదు. మిగిలిన ఎనిమిది నెలల్లోనే ఆ ప్రాజెక్టు ద్వారా గోదావరిజలాలను మళ్లిస్తారు. ఎగువ రాష్ర్టాలకు సైతం అదే సమయంలో నదీజలాలు అవసరమవుతాయి. ఆ 8 నెలల్లో అందుబాటులో ఉండేది కేవలం 500 టీఎంసీలు.. అదీ వానలు బాగా పడితేనే. బనకచర్లతో చంద్రబాబు, కావేరీ అనుసంధానంతో కేంద్రం ఆ జలాలకే ఎసరు పెట్టేందుకు కుట్ర పన్నుతున్నాయి. మరి ఉన్న నీళ్లు వాళ్లు ఎత్తుకు పోతే తెలంగాణ పరిస్థితి ఏం కావాలి?
దేశంలో నదీజలాలకు సంబంధించి కేంద్ర జల సంఘం, నదుల అనుసంధాన ప్రాజెక్టులను చేపట్టే నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) నివేదికలే ప్రామాణికం. ఈ క్రమంలో అసలు గోదావరిలో మిగులుజలాలు అనేవే లేవని స్వయంగా కేంద్ర జల సంఘమే తేల్చి చెప్పింది. 75 శాతం డిపెండబులిటీ (బచావత్ అవార్డు) ప్రాతిపదికన పోచంపాడు (శ్రీరాంసాగర్) ప్రాజెక్టు దిగువన వినియోగంలో ఉన్న, నిర్మాణమవుతున్న, భవిష్యత్తులో చేపట్టే సాగునీటి ప్రాజెక్టులను పరిగణలోనికి తీసుకొని లెక్కిస్తే 157 టీఎంసీల లోటు ఉందని తన తాజా అధ్యయనంలో తేల్చింది. కేంద్ర జల సంఘం నివేదిక (నంబరు 1/2018/ఎన్అండ్డబ్ల్యూ) ప్రకారం 75 శాతం డిపెండబులిటీపై అసలు మిగులుజలాలే లేవని తేల్చి చెప్పింది.
ఇక, 50 శాతం డిపెండబులిటీపై శ్రీరాంసాగర్ ప్రాజెక్టు దిగువన 569 టీఎంసీల మిగులుజలాలు ఉన్నాయని చెప్పగా, 50 శాతం డిపెండబులిటీపై 387.75 టీఎంసీల మిగులు ఉందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో మిగులు జలాలు అనేవి కేవలం ఒక రాష్ట్ర హక్కుగా ఉండవు. వీటిని కూడా బేసిన్‌లోని అన్ని రాష్ర్టాలకు పంపిణీ చేయాల్సి ఉంటుంది. రాజ్యాంగం ప్రకారమైతే ఆ బాధ్యతను ట్రిబ్యునల్ చేపట్టాలి. కృష్ణా బేసిన్లో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఆ ప్రక్రియను చేపట్టింది. కానీ గోదావరిలో ఆ ప్రక్రియ జరగలేదు. అంతమాత్రాన అవి సముద్రంలో కలిస్తే దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు, ఇతర రాష్ర్టాలకు తరలించేందుకు కేంద్రానికి హక్కు ఉండదు.