కరీంనగర్, జూలై 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బొగ్గుగనుల ప్రైవేటీకరణ, వేలానికి వ్యతిరేకంగా పోరాడుతున్న కార్మికసంఘాలను అణచివేయాలన్న వ్యూహంలో భాగంగానే సికాస మాజీ నాయకుడు రమాకాంత్ అలియాస్ మహ్మద్ హుస్సేన్ అలియాస్ సుధాకర్‌ను అరెస్టు చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అణచివేత చర్యలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా తెరలేపాయన్న అనుమానాన్ని కార్మికసంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలు, బొగ్గు గనుల వేలంపై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ఇటువంటి అనుమానాలకు బలం చేకూరుస్తున్నదని చెప్తున్నారు.
ఇప్పటికే దేశవ్యాప్తంగా బొగ్గు గ నుల వేలం ప్రక్రియను చేపట్టిన కేంద్ర ప్రభు త్వం.. గత నెలలో హైదరాబాద్‌లో ఈప్రక్రియను లాంఛనంగా ప్రారంభించింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బొగ్గు గనుల వేలాన్ని వ్యతిరేకించింది. వేలం వేయకుండా అడ్డుకున్నది. సింగరేణికి నేరుగా గనులు కేటాయించాలని అప్పటి సీఎం కేసీఆర్ ఎన్నోసార్లు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ బొగ్గు గనుల వేలాన్ని అడ్డుకోవడంలో విఫలమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. బొగ్గు గనుల వేలా న్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనల రూపంలో వ్యతిరేకిస్తున్నప్పటికీ, అంతర్గతంగా సమర్థిస్తున్నదనే ఆరోపణలున్నాయి. బొగ్గు గనుల వేలంపై ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరుకావడం, బొగ్గు బ్లాక్‌ల వేలాన్ని వ్యతిరేకిస్తున్నట్టు వినతిపత్రం ఇవ్వడం ఉదహరిస్తున్నారు.
కార్మికసంఘాల పోరుబాట
బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ, వేలానికి వ్యతిరేకంగా సింగరేణిలోని అన్ని కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. తొలుత తెలంగాణ బొ గ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు ప్రారంభించగా, ఇతర సంఘాలు సైతం పోరుబాట పట్టాయి. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ సైతం ఆందోళన బాటపట్టింది. కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ కూడా బొగ్గు బ్లాక్‌ల వేలానికి వ్యతిరేకమని చెప్తున్నది. సీపీఐ, సీపీఎం అనుబంధ సంఘాలు ఏఐటీయూసీ, సీఐటీయూ కూడా ఆందోళనలు చేస్తున్నాయి. జాతీయ కార్మిక సంఘం హెచ్ఎంఎస్ కూడా విప్లవ కార్మిక సంఘాలైన ఐఎఫ్టీయూ, ఏఐఎఫ్టీయూతోపాటు టీఎన్టీయూసీ ఇతర కార్మిక సంఘాలను కలుపుకొని ఐక్య కూటమిగా ఆందోళనలు చేపడుతున్నది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సం ఘం మంగళవారం గోదావరిఖనిలో తలపెట్టిన మహాధర్నాకు అనివార్య కారణాలతో కేటీఆర్ హాజరుకాలేకపోవడంతో దానిని వాయిదా వేసినప్పటికీ, ఆ కార్యక్రమం స్థానంలో మోదీ కు ట్రలపై సదస్సును నిర్వహించింది.
ఉక్కుపాదం
సింగరేణిలో కార్మికసంఘాలు చేస్తున్న పోరాటాల ప్రభావం దేశవ్యాప్తంగా ఇతర బొగ్గు గ నుల మీద పడే అవకాశం ఉంది. దీంతో కేంద్రానికి సింగరేణిలో జరుగుతున్న ఆందోళనలు మింగుడు పడటం లేదు. నిరసన కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుండగా.. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సహరిస్తుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందులో భాగమే.. సికాస మాజీ నాయకుడు మహ్మద్ హుస్సేన్ అలియాస్ ర మాకాంత్ అలియాస్ సుధాకర్‌ను అరెస్ట్ చేశారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఆయన తుపాకీని విడిచిపెట్టి, దశాబ్ద కాలానికిపైగా ప్రజల మధ్య సాధారణ జీవితం గడుపుతున్నారు. ఇప్పుడు హఠత్తుగా సికాస పునర్నిర్మాణానికి పాల్పడుతున్నారని, అందుకే అరెస్టు చేశామని పోలీసులు చెప్తుండటం గమనార్హం. వేలానికి నిరసగా గళమెత్తే కార్మికసంఘాలు, నాయకులను భయబ్రాంతులకు గురిచేయడమే కాకుండా.. నిరసనల్లో సికాస పాల్గొంటున్నదని చెప్పి, ఆందోళనకు అడ్డుకట్ట వేసే కుట్ర ఇందు లో దాగి ఉన్నదని పలు కార్మిక సంఘాలు అంతర్గతంగా చర్చించుకుంటున్నాయి.
కంటి ఆపరేషన్ ఉన్న వ్యక్తిపై కఠినచట్టాలు
తుపాకీ వీడి సాధారణ జీవితం గడుపుతున్న సికాస మాజీ నాయకుడు రమాకాంత్ వయో భారంతో ఉన్నారు. కంటిచూపు మందగించింది. ఈ నెల 2న వరంగల్‌లో కంటి ఆపరేషన్ జరగాల్సి ఉండే. అక్కడ వైద్యులు సమ్మె చేయడంతో ఈ నెల 8కి వాయిదా పడింది. ఆపరేషన్‌కు వెళ్దామనుకున్న సమయంలోనే రమాకాంత్‌ను పోలీసులు ఆరెస్టు చేశారు. ఆయన సహజశైలి ప్రశ్నించే తత్వం. ఎవరైనా ఒక సమస్య కో సం అతని వద్దకు వెళ్తే అందరూ సంఘంగా ఏ ర్పడి.. పోరాడితే పరిష్కారం అవుతుందని సూ చించే వ్యక్తి. అందుకే ఆయనను అనేక సంఘా లు కలిసేవి. సికాసకు ఆయన దూరంగా ఉన్నా రు. సింగరేణిని ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవాలని, వేలం కాకుండా చూడాలని, సంఘాలన్నీ ఒక్కతాటిపైకి వస్తేనే ఇదంతా సాధ్యమని సన్నిహితులతో చెప్తుండేవారని తెలుస్తున్నది. ప్రస్తుతం ఇదే మాటలను అడ్డుపెట్టుకొని.. పోలీసులు ఆయనను అరెస్టు చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కఠిన చట్టాలు
మహ్మద్ హుస్సేన్‌పై పోలీసులు కఠిన చట్టాల కింద కేసులు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 10,12,18,18(బీ) ఉపా యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. చట్ట విరుద్ధమైన సంస్థలో సభ్యుడిగా ఉండటం, చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడటం, కుట్రలు చేయడం, కుట్రలను ప్రేరేపించడం, సలహాలు ఇవ్వడం, ఉగ్రవాద చర్యల కోసం వ్యక్తులను రిక్రూట్ చేసుకోవడం అనే సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఉపా చట్టం కింద అదుపులోకి తీసుకుంటే నాన్ బెయిలెబుల్ ఉంటుంది. సంవత్సరాల కొద్ది జైలు శిక్షలు పడే అవకాశం ఉంటుంది.
సంఘాలను అణిచివేసే కుట్ర
మహ్మద్ హుస్సేన్ చాలాకాలంగా సాధారణ జీవితం గడుపుతున్నారు. ఆయనను హఠాత్తుగా అరెస్టు చేయడం, కఠిన చట్టాల కింద కేసులు నమోదుచేయడం చూస్తుంటే సింగరేణిలో సంఘాల నిరసనలను తొక్కిపెట్టడమే లక్ష్యంగా కనిపిస్తున్నది. ఆయనకు కంటిచూపు మందగించింది. వృద్ధాప్య దశలో అనారోగ్య కారణాలతో బాధపడుతున్నారు. అటువంటి వ్యక్తి ఇప్పటికిప్పుడు సికాస పునర్నిర్మాణానికి ఎలా పాల్పడుతాడు. ఇదంతా ప్రైవేటీకరణకు, వేలానికి నిరసన చేపడుతున్న సంఘాలను అణిచివేసేందుకు జరిగిన కుట్రగానే భావిస్తున్నాం. ప్రభుత్వం తన ధోరణి మార్చుకోవాలి.
– మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ తిరుపతయ్య