హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం నిఘా మరింత పెంచింది. అభ్యర్థుల ఖర్చును పరిశీలించేందుకు అదనంగా ఐఆర్ఎస్ అధికారి సుబోధ్‌సింగ్‌ను నియమించింది. ఇప్పటికే ఐఆర్ఎస్ అధికారి సమత ముళ్లపూడి వ్యయ పరిశీలకురాలిగా కొనసాగుతున్నారు. వీరికి సహాయకంగా కేంద్ర ఆదాయపన్ను శాఖ నుంచి దర్యాప్తు విభాగానికి చెందిన ఏడుగురు సిబ్బందిని కేటాయించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ ఆదివారం ప్రకటన విడుదల చేశారు. పోలింగ్‌కు ఏర్పాట్లు తుదిదశలో ఉన్నాయని.. ఈ నెల 25తో ఈవీఎంల పరిశీలన, 28తో ఎన్నికల అధికారుల శిక్షణ ముగుస్తుందని వివరించారు.
మొత్తం 1,207 బ్యాలెట్ యూనిట్లు, 403 కంట్రోల్ యూనిట్లు, 403 వీవీప్యాట్లు అందుబాటులో ఉంచామన్నారు. 80 ఏండ్లకు పైబడిన 345 మంది వృద్ధులు, 394 మంది దివ్యాంగులు బ్యాలెట్ ఓట్ల కోసం దరఖాస్తు చేసుకొన్నట్టు వెల్లడించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం అధికారులు, పార్టీ ప్రతినిధులతో కూడిన బృందాలు బ్యాలెట్ ఓటర్ల ఇండ్లకు వెళ్లి ఓటు తీసుకోనున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు రూ.2.49 కోట్ల నగదును సీజ్ చేసి, 12 కేసులు నమోదు చేశామన్నారు. అలాగే 1,483 లీటర్ల మద్యాన్ని సీజ్ చేసి 36 మందిపై 77 కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం మేరకు ఫ్లయింగ్ స్క్వాడ్లు ప్రకటనలు ఇవ్వడంతోపాటు కరపత్రాలు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ఫిర్యాదుల కోసం 08682230198 నంబర్‌తో 24 గంటలూ పనిచేసే ప్రత్యేక కాల్‌సెంటర్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఇందులోని 14 మంది సభ్యుల్లో నలుగురు ఫిర్యాదులు స్వీకరిస్తారని, మిగతావారు సమాచారాన్ని సేకరించి, విశ్లేషిస్తారని వికాస్‌రాజ్ వివరించారు.