హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): విదేశాల నుంచి బొగ్గును దిగుమతి చేసుకునేందుకు కుదుర్చుకున్న ఒప్పందాలు జూన్ వరకు కొనసాగేలా చూసుకోవాలని, దేశంలోని అన్ని థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో 6% విదేశీ బొగ్గును బ్లెండ్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు అన్ని రాష్ర్టాల్లోని ప్రభుత్వాలకు, వాటి ఆధ్వర్యంలో నడిచే థర్మల్ విద్యుత్తు కేంద్రాల సీఎండీలకు కేంద్ర ఇంధన శాఖ ఓ సర్క్యులర్‌ను జారీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య దేశంలో విద్యుత్తు డిమాండ్ 250 గిగావాట్లకు చేరే అవకాశమున్నదన్న అంచనాల నేపథ్యంలో ఈ సర్క్యులర్‌ను జారీ చేసిన కేంద్రం.. థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో 6% విదేశీ బొగ్గును వాడాలన్న ఆదేశాలను కూడా జూన్ వరకు పొడిగిస్తున్నట్టు స్పష్టం చేసింది.