హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరాల నియంత్రణకు, నేర పరిశోధనలో మరింత పకడ్బందీగా వ్యవహరించేందుకు త్వరలో తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)ను ఏర్పాటు చేయనున్నట్టు డీజీపీ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. ప్రముఖ విద్యాసంస్థలతోపాటు పౌర సమాజంలోని వివిధ సంస్థల భాగస్వామ్యంతో దీన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ‘సైబర్ సేఫ్టీ అండ్ నేషనల్ సెక్యూరిటీ’ అనే అంశంపై శనివారం గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)లో సదస్సు నిర్వహించారు.
కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైం కో-ఆర్డినేషన్ సెంటర్, తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన తెలంగాణ సైబర్ క్రైం కో-ఆర్డినేషన్ సెంటర్ (టీ4సీ), సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించాయి. రాష్ట్ర హోం, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శులు రవిగుప్తా, జయేశ్ రంజన్ల ప్రారంభోపన్యాసాలతో మొదలైన ఈ సదస్సులో సైబర్ నేరాల తీరు, వాటిని అరికట్టేందుకు చేపట్టాల్సిన చర్యలు, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లు, సైబర్ నేరాల దర్యాప్తు తదితర అంశాలపై పోలీస్, ఐటీ, సైబర్ నిపుణులతో చర్చా గోష్ఠులు నిర్వహించారు. కార్యక్రమం ముగింపు సందర్భంగా డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రసంగిస్తూ.. సైబర్ నేరాలను కట్టడి చేయడంలో తెలంగాణ పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 800కుపైగా పోలీస్ స్టేషన్లలో ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ఇద్దరికి సైబర్ వారియర్స్‌గా శిక్షణ ఇచ్చామని, రాష్ట్రస్థాయిలో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయడంతోపాటు ప్రతి జిల్లాలో సైబర్ ల్యాబ్‌లను నెలకొల్పామని వివరించారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేందుకు ప్రజలు చేపట్టాల్సిన జాగ్రత్తల గురించి ఐజీ రాజేశ్ కుమార్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, సైబర్ క్రైం డీసీపీ కల్మేశ్వర్ సింగెనవర్, ఎండ్ నౌ ఫౌండేషన్ వ్యవస్థాపక సీఈవో అనిల్ రాచమల్ల, సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు శ్రీనివాస్ బూసారపు తదితరులు వివరించారు. సైబర్ నేరాలను నిరోధించేందుకు రూపొందించిన పోస్టర్లను కేంద్ర హోం శాఖ డైరెక్టర్ పౌషుమి బసు, ఎస్సీఎస్సీ ప్రధాన కార్యదర్శి కృష్ణ ఏదులతో కలిసి డీజీపీ మహేందర్‌రెడ్డి ఆవిష్కరించారు. సైబర్ నేరాలపై అవగాహనకు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకొన్నాయి. కార్యక్రమంలో సైబర్ క్రైం విభాగాల ఉన్నతాధికారులు, పలువురు సిబ్బంది, ఐఎస్బీ విద్యార్థులు పాల్గొన్నారు.