హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పల్లెలు జాతీయ స్థాయిలో మరోసారి ప్రశంసలు అందుకొన్నాయి. ఈ నెల 22, 23 తేదీల్లో కేంద్ర ప్రభుత్వం పంజాబ్‌లోని చండీగఢ్‌లో ‘గ్రామ పంచాయతీల్లో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల స్థానికీకరణ – స్వీయ నిర్మాణాత్మక మౌలిక సదుపాయాలు’ అనే అంశంపై నిర్వహించిన జాతీయ సెమినార్లో తెలంగాణ పల్లెల ప్రగతి ప్రస్థానాన్ని మన అధికారులు వివరించారు. ఈ సెమినార్‌కు హాజరైన కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కపిల్ పాటిల్, ఆ శాఖ కార్యదర్శి సునీల్ కుమార్ తదితరులు తెలంగాణ పల్లెల్లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రశంసించారు. పల్లెల్లో ఏ విధంగా అభివృద్ధి సాధ్యమైందనే విషయాన్ని అడిగి తెలుసుకొన్నారు. దేశంలో వర్మి కంపోస్టు ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకొంటున్న మొదటి గ్రామంగా ముఖ్రా కే నిలిచిందని పాటిల్ అభినందించారు. ఈ గ్రామం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని సునీల్ కుమార్ ప్రశంసించారు.
పల్లె ప్రగతి, 15వ ఆర్థిక సంఘం నిధులకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులు, వివిధ పథకాలు, ఉపాధి హామీ నిధులను సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధిని సాధిస్తున్నామని తెలంగాణ అధికారులు సెమినార్లో తెలిపారు. అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రతి గ్రామంలో ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్, నర్సరీలు, డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ ప్రకృతి వనాలు, శ్మశాన వాటికలను రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ సెమినార్‌కు దేశం నలుమూలల నుంచి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. తెలంగాణ నుంచి ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ జనార్దన్ రాథోడ్, రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి, వరంగల్ జిల్లా గీసుకొండ మరియాపురం సర్పంచ్ బాల్‌రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖ్రా కె గ్రామ సర్పంచ్ మీనాక్షి గాడ్గె, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెంకటాపూర్ సర్పంచ్ లింగన్నగౌడ్, నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ సర్పంచ్ ధరణి, హన్మకొండ డీపీవో జగదీశ్వర్ హాజరయ్యారు. తెలంగాణ అభివృద్ధి గాథను జాతీయ స్థాయిలో ప్రదర్శించిన వీరిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అభినందించారు.