నిజామాబాద్ : ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు(MLC Kavitha) సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు(Bail order) చేయడంపై సర్వత్ర హర్షం వ్యక్తమవుతున్నది. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ కవిత క్యాంప్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్, జాగృతి(Jagruthi) నేతలు సంబురాలు జరుపుకున్నారు. పటాకులు కాల్చి, స్వీట్లు పంచిపెట్టి ఆనందం వ్యక్తం చేశారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కవితను చేయని తప్పుకు బలి చేశారంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కాగా, ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ బెయిల్ ఇచ్చింది. బెయిల్ కోసం రూ.10 లక్షల పూచీకత్తు సమర్పించాలని సూచించింది. సాక్షు లను ప్రభావితం చేయకూడదని ఆదేశించింది. దీంతో దాదాపు 165 రోజుల తర్వాత కవిత జైలు నుంచి బయటకు రానున్నారు. బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లిక్కర్ కేసులో దర్యాప్తు పూర్తయ్యిందని.. ఛార్జ్ షీట్ కూడా దాఖలైందని ఈ దశలో కవితను జ్యుడీషియల్ కస్టడీలో ఉంచడం సరికాదని అభిప్రాయడింది. సెక్షన్ 45 ప్రకారం ఒక మహిళ బెయిల్ పొందేందుకు అర్హత ఉందని ధర్మాసనం తెలిపింది. గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టిపారేసింది.