హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 8 (నమస్తే తెలంగాణ): అధిక వడ్డీలు ఇస్తామంటూ మాటలు చెప్పి వేలాదిమంది నుంచి లక్షల డిపాజిట్లు సేకరించి మోసం చేసిన ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ (డీఎఫ్ఐ) కేసు బాధితులకు న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని సీసీఎస్ డీసీపీ శ్వేత తెలిపారు. సోమవారం ఆమె బషీర్‌బాగ్‌లోని సీసీఎస్ కన్ఫరెన్స్ హాల్లో బాధితులతో సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. సురాల నర్సింహమూర్తి గత ఏడాది డిసెంబర్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీసీఎస్‌లో సెక్షన్ 406, 420 రెడ్‌విత్ 34 ఐపీసీ, తెలంగాణ స్టేట్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యా క్ట్ కింద కేసు నమోదు చేశామని తెలిపారు. నిందితుల్లో ఒకరైన ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ ట్రస్ట్ డైరెక్టర్ డాక్టర్ పీ కమలాకర్‌శర్మ, మరికొందరు కలిసి బ్రాహ్మణ సమాజాన్ని లక్ష్యంగా చేసుకొని సుమారు నాలుగువేల మంది బాధితుల నుంచి రూ.514 కోట్లు వసూలు చేశారని వెల్లడించారు. కేసు దర్యాప్తు ఆర్థిక నేరాల విభాగం టీమ్-6 ఏసీపీ ఆదిరానారాయణ నేతృత్వంలో కొనసాగుతున్నదని తెలిపారు. డీఎఫ్ఐ కేసు దర్యాప్తులో నిందితులకు సంబంధించి 450 ఎకరాల స్థలంతోపాటు మూడు వేల గజాల కమర్షియల్ స్థలాన్ని గుర్తించామని తెలిపారు. ఈ ఆస్తులను అటాచ్ చేసేందుకు కోర్టు నుంచి కొన్నింటికి అనుమతి లభించిందని, మరికొన్నింటికి అనుమతి రావాల్సి ఉన్నదని వివరించారు. 30 బ్యాంకు ఖాతాలను గుర్తించి ఫ్రీజ్ చేశామని, ఫోరెన్సిక్ అడిట్ కూడా పూర్తి చేశామని వివరించారు. బాధితులకు సీసీఎస్‌లో తనతోపాటు దర్యాప్తు అధికారి ఏసీపీ అందుబాటులో ఉంటారని డీసీపీ పేర్కొన్నారు.