హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ తార్నాకలోని ఆర్టీసీ దవాఖానలో గుండె జబ్బులకు సంబంధించిన క్యాథ్‌ల్యాబ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. క్యాథ్ల్యాబ్తోపాటు 12 బెడ్లకు విస్తరించిన ఎమర్జెన్సీ కేర్ యూనిట్‌ను ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ శుక్రవారం ప్రారంభించారు. క్యాథ్‌ల్యాబ్‌ను ఫ్యాక్ట్స్ ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేయగా.. క్రిటికల్ కార్డియక్ కేర్ యూనిట్‌కు అశోక్ లేలాండ్ సంస్థ సహకరించింది. ఎమర్జెన్సీ కేర్ యూనిట్ విస్తరణకు ‘నిర్మాణ్ డాట్ ఓఆర్జీ’ అనే సంస్థ ద్వారా ఐవోసీఎల్ ఆర్థిక సాయం చేసింది. వీటిని ప్రారంభించిన అనంతరం సజ్జనార్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని తెలిపారు.
తార్నాక దవాఖనకు రోజూ సగటున 2 వేల మంది ఔట్పేషెంట్లు వస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం ఈ దవాఖనలో పూర్తిస్థాయి ఎంఆర్ఐ, సీటీసాన్ సౌకర్యంతోపాటు ఎమర్జెన్సీ వార్డు, 24 గంటల ఫార్మసీ, ఫిజియోథెరపీ యూనిట్ అందుబాటులో ఉన్నాయని, తాజాగా క్యాథ్‌ల్యాబ్ సేవలను ప్రారంభించడంతో అన్ని రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయని వివరించారు. కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, వెంకన్న, తార్నాక దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శైలజామూర్తి, మెడికల్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ శ్రీనివాస్, ఐవోసీఎల్ ప్రతినిధులు సూరజ్ కుమార్, భాసర్‌రావు, కైలాస్ కాంత్, నిర్మాణ్ ఆర్గనైజేషన్ నుంచి శాంతికుమార్, అనురాధ, ఫ్యాక్ట్స్ ఫౌండేషన్ ఎండీ డాక్టర్ శ్రీనివాస్ కుమార్, అశోక్ లేలాండ్ ప్రతినిధులు నీరేశ్ తివారీ, సూర్యనారాయణ, రమేశ్శాస్త్రి పాల్గొన్నారు.