TG Assembly | ప్రభుత్వం కేవలం కుల గణన సర్వే నిర్వహించి.. అసెంబ్లీలో తీర్మానం చేస్తే సరిపోదని.. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు చట్టబద్ధత కల్పించాలని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీలో కుల గణన సర్వే నివేదికను ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని మాట్లాడారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బీసీలు వెనకబడి ఉన్నారన్నారు. ఎన్నో దశాబ్దాలుగా బీసీలు తమ హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నారన్నారు. ప్రభుత్వం చేయించిన కులగణన సర్వేపై కొన్ని వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయన్నారు. గడిచిన పదిహేనేళ్లలో బీసీల జానాభా అంతగా పెరగలేదని సర్వే చెబుతున్నదన్నారు. దేశాభివృద్ధిలో, రాష్ట్రాభివృద్ధిలో వెనుకబడిన వర్గాలది కీలకపాత్ర అన్న తలసాని.. ఎస్సీల జనాభా, ముస్లింల జనాభా తగ్గినట్లుగా సర్వే చెప్తోందన్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో 30శాతం మంది కూడా సర్వేలో పాల్గొనలేదని తెలుస్తుందన్నారు. జీహెచ్ఎంసీలో చాలామంది తమ వివరాలు చెప్పలేదని తెలుస్తోందన్నారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని బీసీలు భావిస్తున్నారని.. జనాభా దామాషా మేరకు రాజకీయ న్యాయం జరగాలని బీసీలు భావిస్తున్నారన్నారు. కేవలం సర్వే చేయించి.. తీర్మానం చేస్తే సరిపోదని.. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు చట్టబద్ధత కల్పించాల్సిందేనన్నారు. సర్వే కోసం 56 అంశాలను పరిగణలోకి తీసుకున్నారని.. అనేక అంశాలు ఉండడంతో చాలా మంది సర్వేలో పాల్గొనలేదన్న తలసాని.. మళ్లీ ఫార్మాట్‌ను మార్చి సర్వే చేయించాలని డిమాండ్ చేశారు. సర్వే ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం.. 3.54 లక్షల మంది ఉన్నారని.. 14 ఏళ్లలో 14 లక్షల జనాభానే పెరిగిందా? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఏ కులం జనాభా ఎంత పెరిగిందో ప్రభుత్వం వెల్లడించాల్సిందేనన్నారు.