హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 17 (నమస్తే తెలంగాణ): కరక్కాయలను కొని, వాటిని పౌడర్ చేసి ఇస్తే తిరిగి అధిక ధరకు కొంటామని మోసం చేసిన కేసులో సైబరాబాద్ పోలీసులు 281 మంది బాధితులకు ఆర్థిక ఊరట కల్పించారు. వారి బ్యాంక్ అకౌంట్లలో 73.53 లక్షలు తిరిగి జమ చేసేలా చర్యలు తీసుకొన్నారు. 2018లో ఏపీకి చెందిన మల్లికార్జున్ హైదరాబాద్లోని కేపీహెచ్బీ ప్రాంతంలో సాఫ్ట్ ఇంటిగ్రేట్ మల్టీ టూల్స్ పేరుతో ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు.
కంపెనీ నుంచి రూ.వెయ్యి పెట్టి కిలో కరక్కాయ కొని, 15 రోజుల తర్వాత ఆ కాయలను పౌడర్ చేసి తీసుకొస్తే రూ.1,300 చెల్లించి కొంటామని చెప్పాడు. 15 రోజుల్లోనే పెట్టుబడికి అదనంగా రూ.300 వస్తాయని ఆశపడి దాదాపు 423 మంది కరక్కాయలు కొన్నారు. మొత్తంగా రూ.3.75 కోట్లు వసూలు చేసిన మల్లికార్జున్.. మూడు నెలల్లోనే బిచాణా ఎత్తేశాడు. బస్వరాజు అనే వ్యక్తి ఒక్కడే రూ.40 లక్షల కరక్కాయలు కొన్నాడు. అతని ఫిర్యాదుతోనే కేపీహెచ్బీ పోలీసులు కేసు నమోదు చేశారు.
దర్యాప్తు చేపట్టి 10 మంది నిందితులను అరెస్టు చేశారు. మోసపోయిన 281 మంది బాధితులు నగదుకు సంబంధించిన ఆధారాలు సమర్పించగా, వారి డాటాను పోలీసులు భద్రపరిచారు. నిందితుల ఆస్తులు వేలం వేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అటు.. మోసం చేసిన డబ్బుతోనే నిందితులు ఆస్తులు కొన్నట్టు గుర్తించి, పోలీసులు ఆధారాలను కోర్టులో సమర్పించారు.
దీంతో కోర్టు.. పదవీ విరమణ చేసిన సివిల్ జడ్జిని ఆక్షన్ కమిటీ కమిషనర్గా నియమించింది. వేలంలో వచ్చిన డబ్బును ప్రో-రాటా నిష్పత్తి ప్రకారం బాధితుల ఖాతాల్లోకి నేరుగా చేరేలా చేశారు. దీనికి సంబంధించిన చెక్కులను ఆదివారం సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర 12 మంది బాధితులకు అందజేశారు. కార్యక్రమంలో ఆక్షన్ కమిటీ చైర్మన్ జే సాంబశివ, క్రైం డీసీపీ కలేశ్వర్ సింగన్వార్ తదితరులు పాల్గొన్నారు.