Youtuber Anvesh | యూట్యూబర్ అన్వేష్‌పై హైదరాబాద్‌లోని పంజాగుట్ట, ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ దేవతలు, మహిళలను కించపరిచేలా మాట్లాడాడని అన్వేష్‌పై ఫిర్యాదులు అందడంతో రెండు కేసులు నమోదు చేశారు.
దేవీ దేవతలను యూట్యూబర్ అన్వేష్ దూషించాడని సినీ నటి, బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కల్యాణి ఫిర్యాదుపై బీఎన్ఎస్ 352, 73, 299, ఐటీ యాక్ట్ 67 కింద కేసు నమోదు చేసుకున్నారు. దీనిపై త్వరలోనే అన్వేష్‌కు పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేయనున్నారు.
ఇదిలా ఉంటే యూట్యూబర్ అన్వేష్‌పై ఖమ్మం జిల్లా దానవాయిగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఖమ్మం అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యూట్యూబర్ అన్వేష్ చేసిన వ్యాఖ్యలు సామాజిక భావోద్వేగాలను దెబ్బతీసేలా ఉన్నాయని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఆ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని ఖమ్మం అర్బన్ పోలీసులు వెల్లడించారు.