ఆదివారం 24 జనవరి 2021
Telangana - Dec 28, 2020 , 00:21:19

నెరవేరిన సొంతింటి కల

నెరవేరిన సొంతింటి కల

సిద్దిపేట రూరల్‌: పేదల సొంతింటి కలను నెరవేర్చిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట  కేసీఆర్‌ నగర్‌ కాలనీలో నాలుగో విడతలో 168 మంది లబ్ధ్దిదారులకు డబుల్‌ బెడ్రూం ఇండ్ల పట్టాలతోపాటు పట్టు వస్ర్తాలను కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ ముజామ్మిల్‌ఖాన్‌తో కలిసి మంత్రి హరీశ్‌రావు ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా గేటెడ్‌ కమ్యూనిటీ తరహాలో ఇండ్లు నిర్మించి ఇచ్చినందున వాటిని కాపాడుకోవాలన్నారు. ఇండ్లను కిరాయికి ఇచ్చినా, అమ్మినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

త్వరలోనే బస్తీ దవాఖాన, పోలీస్‌ అవుట్‌పోస్టుతోపాటు ప్రజలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని ఏ ఇంటికీ పైప్‌డ్‌ గ్యాస్‌ కనెక్షన్‌ లేదని, అలాంటిది సిద్దిపేట కేసీఆర్‌నగర్‌లో అందిస్తున్నామన్నారు. లబ్ధిదారులు ఎవరైనా రూపాయి లంచం ఇచ్చినట్టు నిరూపిస్తే వారికి రూ.10 వేలు రివార్డు ఇస్తామన్నారు. పైరవీలకు అవకాశం లేకుండా అర్హులైన పేదవారికే ఇండ్లు కేటాయించినందున ధైర్యంగా లబ్ధిదారుల జాబితాను గోడలపై అతికించామన్నారు. సోషల్‌ మీడియాలో తనపై ఎన్నో ఆరోపణలు చేసిన ఓ పార్టీకి చెందిన వ్యక్తికి సైతం ఇల్లు వచ్చిందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. స్వయంగా అతనే వచ్చి తనను కలిసి కృతజ్ఞతలు తెలిపాడన్నారు. కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలోని 718 జిల్లాల్లో పేదలకు ఇలాంటి డబుల్‌ బెడ్రూం ఇండ్లు ఎక్కడా లేవన్నారు. 


logo