అచ్చంపేట, జనవరి 16 : అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతోపాటు మరికొంతమంది బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదైంది. బుధవారం రాత్రి పట్టణంలోని భ్రమరాంబ ఆలయం వద్ద ప్రభోత్సవం ఊరేగింపు సందర్భంగా ఆలయంలోకి వెళ్లేందుకు గువ్వల దంపతులు వచ్చారు. ఆలయం లోపల స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ ఉండడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ నాయకులు, పోలీసులు, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో పోలీసుల తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గువ్వల ఆలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో గురువారం వీరిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై రమేశ్ తెలిపారు.
కరీంనగర్ కోర్టుచౌరస్తా, జనవరి 16 : హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి మంజూరైన బెయిల్‌కు సంబంధించిన పూచీకత్తులను గురువారం కరీంనగర్ మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరై సమర్పించారు. కరీంనగర్ కలెక్టరేట్లో ఈ నెల 12న నిర్వహించిన ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌తో గొడవకు సంబంధించి కౌశిక్‌రెడ్డిపై కరీంనగర్ వన్ టౌన్లో రెండు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. కోర్టు ఆదేశాల ప్రకారం కౌశిక్‌రెడ్డి నలుగురు వ్యక్తులను జమానతుగా సమర్పించగా కోర్టు స్వీకరించింది.