కరీంనగర్ : గాడిదను దొంగిలించి.. హింసించిన కేసులతో ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. సతీశ్ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు ఆధారంగా కొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు కరీంనగర్ అదనపు డీసీపీ (లా అండ్ ఆర్డర్) శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం పోలీస్ కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాలులో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య పద్ధతిలో భావ ప్రకటన స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉంటుందని, ఎదుటివారి మనోభావాలు దెబ్బతీయకుండా, ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఉండాలన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా చేపల వ్యాన్‌లో గాడిదను తరలించి, దాంతో అమానుషంగా ప్రవర్తించడంపై ఐటీ, జంతు హింస కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో రూరల్ సీఐ విజ్ఞాన్ రావు, ఎస్ఐ ఎల్లయ్య గౌడ్ పాల్గొన్నారు.