Palla Rajeshwar Reddy | హైదరాబాద్ సిటీబ్యూరో/మేడ్చల్, ఆగస్టు 24(నమస్తే తెలంగాణ): అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూట్స్, గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌కి చెందిన భవనాలు కొర్రెముల గ్రామ పరిధిలోని వెంకటాపుర్‌లోని నాదం చెరువు బఫర్ జోన్లో ఉన్నాయని ఘట్కేసర్ ఇరిగేషన్ సెక్షన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఏ పరమేశ్ గురువారం పోచారం ఐటీ కారిడార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నామని పోచారం పోలీసులు తెలిపారు. ఇదంతా రాజకీయ కక్ష్యతో కుట్రపూరితంగా చేస్తున్నారని అనురాగ్ సంస్థల చైర్మన్, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. గాయత్రి ట్రస్ట్, అనురాగ్ సంస్థలు 25సంవత్సరాలలో ఏనాడు ప్రభుత్వ అనుమతులు లేకుండా భవన నిర్మాణాలు చేయలేదని ఆయన ఓ ప్రకటనలో వివరించారు.
కక్షపూరితంగానే కేసులు
విద్యాజ్యోతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అనురాగ్ ఇంజినీరింగ్ కాలేజీ, కోదాడలో ఐఏసీటీఈ, జేఎన్టీయూ అనుమతులు ఇచ్చిన తరువాత ప్రస్తుతం నడుస్తు న్న కోర్సులలో 480 సీట్లను కోత పెట్టి, రా ష్ట్రంలోని 99 శాతం కాలేజీలకు అనుమతులిచ్చి మాకు మాత్రం ఇవ్వకుండా ప్రభు త్వ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. తనపై వ్యక్తిగతంగా జనగామలో ఎన్నికలు పూర్తయిన తరువాత 4 కేసులు, హైదరాబాద్ 2 కేసు లు పెట్టారని అన్నారు. అనురాగ్ యూనివర్శిటీపై వివిధ డిపార్టుమెంట్లు నిత్యం సోదాలు నిర్వహిస్తున్నాయని చెప్పారు. ఏమీ దొరకకపోవడంతో ఇలా ఒత్తిడి తెస్తున్నారని, అయినా చట్ట పరిధిలోనే న్యాయం కోసం పోరాడుతానని రాజేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు.