Roasting | హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): ఆన్లైన్లో మృగాళ్లు రెచ్చిపోతున్నారు. చిన్నారులు, తల్లి, చెల్లి, తండ్రి.. అనే బంధాలకు విలువలేకుండా రోతగా రోస్టింగ్ చేస్తున్నారు. వీరి వికృతతీరుతో నలుగురు ఆన్లైన్లో కూర్చొని కబుర్లు చెప్పుకునే రోస్టింగ్ విధానం రానురానూ పరమ రోతగా తయారవుతున్నది.
ఇటీవల ఓ చిన్నారిని తండ్రి బెల్ట్‌తో బెదిరించే వీడియోను ఖండించాల్సింది పోయి.. దానిపై అసభ్యకర జోకులు వేయటం, మరో వీడియోలో ఓ చిన్నారి బాత్‌టబ్ స్నానంపై అసభ్యకరంగా మట్లాడటంపై హీరో సాయిధరమ్ తేజ్ ఎక్స్‌లో పోస్టు చేశారు. అలాంటి వ్యక్తులు, వేదికలపై తక్షణం చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను రాష్ట్ర డీజీపీ, సీఎంవో, షీటీమ్స్‌ను ట్యాగ్చేశాడు. స్పందించిన యంత్రాంగం.. నిందితులపై కొత్త చట్టాల ప్రకారం కేసు నమోదు చేసింది.
తండ్రి కూతురిపై అసభ్య కామెంట్లు
ఓ వీడియోలో తండ్రి, కూతురు సంబంధాన్ని తప్పుగా చూపిస్తూ ప్రణీత్ హన్మంతు, ఆది నారాయణ, డల్లాస్ నాగేశ్వర్రావు, బుర్ర యవరాజ్ వెకిలి చేష్టలు చేశారు. ఆ వీడియోపై ఇష్టారీతిన మాట్లాడారు. వీరిలో ప్రణీత్ హన్మంతు తండ్రి అరుణ్‌కుమార్ ఐఏఎస్ కాగా, అన్న ప్రముఖ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అజయ్ (ayejude).
ఇంతటి వ్యక్తిపై మీద కేసు నమోదు చేశామని చెప్తున్న పోలీసులు ఏ మేరకు చర్యలు తీసుకుంటారు? అనేది సందేహంగా మారింది. తాజాగా ఆన్లైన్ రోస్టింగ్పై సీఎం రేవంత్, మంత్రి సీతక్క సైతం స్పందించారు. ‘తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని కొంతమంది నీచులు వక్రీకరించడం దారుణం. సామాజిక మాధ్యమాల్లో రెచ్చిపోయిన దుర్మార్గులపై కేసు నమోదు చేశాం. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటాం’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏమిటీ ఆన్లైన్ రోస్టింగ్?
రోస్టింగ్ అనేది సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్. దీనిలో ఒక వ్యక్తి లేదా నలుగురైదుగురు లైవ్‌లోకి వచ్చి, ఏదైనా అంశం, వీడియోపై మాట్లాడుతూ, కామెంట్లు చేస్తూ ఎకువ మంది ప్రేక్షకులను రంజింపజేయటం. హాస్యానికి మారుపేరైన ఆన్లైన్ రోస్టింగ్‌ను రోత హాస్యానికి కేరాఫ్‌గా కొందరు మృగాళ్లు మార్చారు. మొదట్లో ఆన్లైన్ రోస్టింగ్ సంస్కృతి సన్నిహితులు, కుటుంబీకులు, స్నేహితుల మధ్య ఉండేది. ఇప్పుడు అది అసభ్యకర వేదికగా మారింది.