హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ (సీఏఎస్) కింద ప్రమోషన్లు కల్పించే అంశం వివాదాస్పదమవుతున్నది. ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యోగోన్నతుల రగడ నడుస్తున్నది. తాజాగా డిగ్రీ లెక్చరర్లకు ప్రమోషన్లు కల్పించే అంశంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఉద్యోగోన్నతులకు పాత సర్వీసును లెక్కించడం యూజీసీ నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ తెలంగాణ గవర్నమెంట్ కాలేజీ టీచర్స్ అసొసియేషన్ (టీజీసీటీఏ) సీఎంవో కార్యదర్శి అజిత్‌రెడ్డిని కలిసి పలు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. జూనియర్ లెక్చరర్‌గా పనిచేసిన పాత సర్వీసు లెక్కింపునకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేందుకు సీఎంవోలో పెండింగ్‌లో ఉన్న ఫైల్‌ను ఆమోదిస్తే ఇబ్బందులు తప్పవని ఆయనకు స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ ఫైల్‌ను ఆర్థికశాఖ రెండు సార్లు తిరస్కరించిందని గుర్తుచేస్తూ.. మరికొన్ని వాదనలను అజిత్‌రెడ్డి ముందుంచింది.
రాష్ట్రంలో జూనియర్ లెక్చరర్లకు డిగ్రీ లెక్చరర్లుగా ప్రమోషన్లు కల్పించే సంప్రదాయం ఉన్నది. డిగ్రీ లెక్చరర్లుగా ఉద్యోగోన్నతి పొందిన తర్వాత కూడా వివిధ స్థాయిల్లో ఉద్యోగోన్నతులుంటాయి. డీఎల్స్ను తొలుత అసిస్టెంట్ ప్రొఫెసర్ అకడమిక్ లెవల్-10గా పరిగణిస్తారు. సీఏఎస్ ప్రమోషన్లల్లో భాగంగా పీహెచ్డీ ఉంటే నాలుగేండ్లు, ఎంఫిల్ ఉంటే ఐదేండ్లు, నెట్/సెట్ అర్హత ఉంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ అకడమిక్ లెవల్-11 ఉద్యోగోన్నతి లభిస్తుంది. అనంతరం ఐదేండ్ల సర్వీసు ఉంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ అకాడమిక్ లెవల్-12 ప్రమోషన్ వస్తుంది. ఆ తర్వాత మూడేండ్ల సర్వీస్‌తోపాటు యూజీసీ మార్గదర్శకాల ప్రకారం అసోసియేట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగోన్నతి కల్పిస్తారు. ఈ ప్రమోషన్లకు జేఎల్స్‌గా పనిచేసిన పాత సర్వీసును కూడా లెక్కలోకి తీసుకోవాలన్న అంశం తెరపైకి రావడంతో సంబంధిత ఫైల్‌ను అధికారులు ప్రభుత్వానికి పంపారు.
ప్రస్తుతం ఆ ఫైల్ సీఎం పరిశీలనలో ఉన్నది. ఇది యూజీసీ నిబంధలకు విరుద్ధమని టీజీసీటీఏ ప్రతినిధులు అంటున్నారు. సీఐఎస్ఆర్, ఐకార్, డీఆర్డీవో, యూజీసీ, ఐసీఎస్ఎస్ఆర్, ఐసీహెచ్ఆర్, ఐసీఎంఆర్, డీబీడీటీ లాంటి సైంటిఫిక్, ప్రొఫెషనల్ జాతీయ సంస్థల్లో పనిచేసిన రెగ్యులర్ సర్వీసును మాత్రమే ఉద్యోగోన్నతుల కోసం పరిగణనలోకి తీసుకోవాలని యూజీసీ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయని చెప్తున్నారు. జూనియర్ లెక్చరర్ సర్వీసును డిగ్రీ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రమోషన్లకు లెక్కించడం యూజీసీ మార్గదర్శకాలను ఉల్లంఘించడమే అవుతుందని, దీని వల్ల ప్రభుత్వంపై కోట్ల రూపాయల భారం పడుతుందని పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చొరవ తీసుకుని దీనిని నిలిపివేయాలని టీజీసీటీఏ ప్రతినిధులు కోరుతున్నారు.