హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): జువెనైల్ జస్టిస్ బోర్డు, డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ బోర్డు పరీక్షల కోసం అభ్యర్థులు నిరీక్షిస్తున్నారు. రెండుసార్లు దరఖాస్తులు స్వీకరించి హడావుడి చేసిన ప్రభుత్వం పరీక్ష నిర్వహణలో జాప్యం చేస్తుండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. అసలు పరీక్ష పెడతారా? పెట్టరా? అనే మీమాంసతో 3 వేల మంది అభ్యర్థులు కొట్టుమిట్టాడుతు న్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పష్టత ఇవ్వడంలేదని వాపోతున్నారు. రెండునెలలుగా పంచాయతీ ఎన్నికలు సాకుగా చూపి తప్పించుకున్నారని ఆరోపించారు.
ఎన్నికలు ముగిసి పదిరోజులైందని, వెంటనే పరీక్ష నిర్వహించి జేజేడబ్ల్యూ, డీసీడబ్ల్యూసీ చైర్పర్సన్, సభ్యుల నియామక ప్రక్రియ పూర్తిచేయాలని విజ్ఞప్తిచేస్తున్నారు. జస్టిస్ జువెనైల్ బోర్డు, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ బోర్డు సభ్యుల పదవీకాలం 2024 ఫిబ్రవరిలో ముగిసింది. అప్పటి నుంచి పూర్వపు పాలకవర్గాలనే కొనసాగిస్తూ వస్తున్నారు. 33 జిల్లాలకు 36 జేజేడబ్ల్యూ, డీసీడబ్ల్యూసీ బోర్డులు (హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో రెండు చొప్పున) ఏర్పాటు చేసి చైర్పర్సన్, సభ్యులను భర్తీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది.
2025 జూలై 22న తొలిసారి నోటిఫికేషన్ జారీ చేసి ఆగస్టు 18 వరకు గడువు విధించింది. ఒక్కో బోర్డులో మహిళా, పిల్లల నిపుణులు తప్పనిసరిగా ఉండాలని నిర్దేశించింది. సుమారు 2 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. కొత్తగా డిగ్రీ పూర్తిచేసిన వారి విజ్ఞప్తి మేరకు 2025 సెప్టెంబర్ 4న నోటిఫికేషన్ జారీ చేసి అదే నెల 18 వరకు గడువు విధించారు. రెండో విడత వెయ్యి మంది దరఖాస్తు చేసుకున్నారు. రెండో విడత గడువు ముగిసిన రెండు వారాల్లోనే పరీక్షలు పెట్టి నియామక ప్రక్రియ పూర్తిచేస్తామని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు ప్రకటించారు. కానీ మూడు నెలలు దాటినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.