హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లోని వైద్య కళాశాలల్లో క్యాన్సర్ డే కేర్ సెంటర్లు ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యాయి. ఈ నెల 8న ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వీటిని హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే క్యాన్సర్ దవాఖాన నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. క్యాన్సర్ వ్యాధ్రిగ్రస్తులకు కీమోథెరపీ అందించేందుకు జిల్లా కేంద్రాల్లో ఈ డే కేర్ సెంటర్లను ఏర్పాటుచేశారు. ఒక్కో డే కేర్ సెంటర్లో 20 బెడ్లు, కీమోథెరపీ పరికరాలు, ఇతర వైద్య సదుపాయా లు కల్పించారు. ఈ సెంటర్లకు ఎంఎన్‌జే క్యా న్సర్ దవాఖాన.. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా పనిచేయనున్నది. డే కేర్ సెంటర్లలో పేషెంట్లకు క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తే వారిని ఎంఎన్‌జేకు రెఫర్ చేస్తారు. పరీక్షల అనంతరం క్యాన్సర్ నిర్ధారణ అయితే అక్కడే మొదటి కీమోథెరపీ చేసి, అనంతరం జిల్లా కేంద్రాల్లోని డే కేర్ సెంటర్లకు తరలించి కీమో సెషన్లు నిర్వహిస్తారు.