High Court | హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఎంపీహెచ్ఏ) నోటిఫికేషన్ 2002 వ్యవహారంపై హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఆ నోటిఫికేషన్లో అర్హతల వివాదంపై సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు వెలువరించిన తరువాత కూడా ప్రభుత్వం జీవో 1207 ద్వారా 1200 మందిని అడ్డదారిలో నియామకాలు చేసిందని తప్పుపట్టింది. కోర్టు తీర్పుల తర్వాత కూడా ప్రభుత్వం దొడ్డిదారిన జీవో ఇచ్చి నియామకాలు చేయడాన్ని రద్దుచేసింది. అర్హతలతో జాబితా తయారు చేసి నియామక ప్రక్రియ పూర్తి చేయాలని తీర్పు వెలువరించింది. తమ తీర్పు వెలువడిన 90 రోజుల్లోగా అర్హులతో జాబితా సిద్ధం చేసి నియామక ప్రక్రియ చేపట్టాలని స్పష్టంచేసింది. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు ఉత్తర్వులు జారీచేసింది. దేశ, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేసిన తర్వాత ఆ తీర్పులకు విరుద్ధంగా ప్రభుత్వం జీవో ఇచ్చి నియామకాలు చేయడం చెల్లదని తేల్చి చెప్పింది.
కోర్టు తీర్పు తర్వాత తొలగించిన 1200 మందిని కాంట్రాక్ట్ పద్ధతిలో తిరిగి విధుల్లోకి తీసుకుంటూ 2002లో నాటి సమైక్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో 1207 జారీ చేయడం చట్టవిరుద్ధమని వెల్లడించింది. కోర్టు తీర్పులను అమలు చేయకపోగా ఆ తీర్పులకు విరుద్ధంగా ప్రభుత్వ జీవో ఉన్నదని ప్రకటించింది. న్యాయస్థానాల తీర్పుల స్ఫూర్తికి విరుద్ధంగా నియామకాలు ఉన్నాయని ఆక్షేపించింది. కోర్టు తీర్పుల తర్వాత వాళ్లనే తిరిగి విధుల్లోకి తీసుకోవడంతో అనేక సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించింది. జీవో 1207 మేరకు జరిగిన 1200 మంది ఎంపీహెచ్ఏల నియామకాలను తాము సమర్థిస్తే ప్రభుత్వం చేసిన తప్పునే తాము కూడా చేసినట్టు అవుతుందని హైకోర్టు అభిప్రాయపడింది. అందుకే జీవో 1207 ప్రకారం భర్తీ చేసిన 1200 మంది ఎంపీహెచ్ఏల నియామకాలను రద్దు చేస్తున్నట్టు న్యాయమూర్తులు జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావుతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం ప్రకటించింది. హైకోర్టు, సుప్రీంకోర్టు ఉత్తర్వుల తర్వాత 1200 మందిని తొలగించిన ప్రభుత్వం తిరిగి వారినే కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించడాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది.
పిల్లల దత్తత దరఖాస్తులపై4 వారాల్లోగా తేల్చండి ;పోలీసులు స్వాధీనం చేసుకున్న చిన్నారుల సంరక్షణపై 2 వారాల్లోగా నిర్ణయం తీసుకోండి: హైకోర్టు
హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): పిల్లల దత్తత కోసం తల్లిదండ్రులు చేసుకున్న దరఖాస్తులపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సంబంధిత అధికారులను ఆదేశించింది. దత్తత పేరుతో చట్టవిరుద్ధంగా పిల్లలను కొనుగోలు చేశారని పేరొంటూ పోలీసులు స్వాధీనం చేసుకున్న చిన్నారులను సంరక్షించడంపై 2 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని బాలల సంరక్షణ కమిటీకి స్పష్టం చేసింది. అక్రమంగా దత్తత తీసుకున్న పిల్లలను చట్టప్రకారం వారి తల్లిదండ్రులకు అందజేయాలన్న సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీళ్లపై విచారణ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాథే, జస్టిస్ జే శ్రీనివాసరావు ధర్మాసనం ఇటీవల ఈ తీర్పు వెలువరించింది.