హైదరాబాద్, నవంబర్5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థకు సంబంధించి ప్రధాన కార్యాలయంలో కల్పించిన ప్రమోషన్లలో అక్రమాలు జరిగాయని తెలంగాణ గవర్నమెంట్ ఆల్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్(టిగారియా) ఆరోపించింది. పదోన్నతులను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేసింది. ఎస్సీ గురుకుల సొసైటీలో అన్ని స్థాయిల్లోని పోస్టులు దాదాపు ఖాళీ అయ్యాయని, ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలని కోరింది.
అసోసియేషన్ ప్రధాన కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో గురుకుల సమస్యలపై చర్చించారు. అనంతరం అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ అలగోని నరసింహులు గౌడ్, జనరల్ సెక్రటరీ ఎస్ గణేశ్, వరింగ్ ప్రెసిడెంట్ కే జనార్దన్, వైస్ ప్రెసిడెంట్ భిక్షంయాదవ్ మాట్లాడారు. 140గురుకులాలు ఇన్చార్జి ప్రిన్సిపాళ్ల ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయని, సీనియార్టీని పట్టించుకోకుండా, అనుభవం లేని వారిని ఇన్చార్జీలుగా నియమించడం వల్లే అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నాయని వాపోయారు.