అమ్రాబాద్, ఫిబ్రవరి 18 : నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వు పరిధిలో గత నెలలో 50 హెక్టార్లలో అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతైంది. తాజాగా శనివారం రాత్రి దోమలపెంట రేంజ్ పరిధిలోని తాటిగుండాల, ఉప్పునుంతల సమీప అటవీ ప్రాంతం నుంచి కృష్ణానది సమీపంలోని వజ్రాల మడుగు వరకు రెండ్రోజులుగా కార్చిచ్చు రగులుకున్నది. దీంతో సుమారు 18 కిలోమీటర్లకు పైగా అడవి కాలడంతో మంటలను ఆర్పేందుకు సంబంధిత శాఖ ఎలాంటి ఫైర్ జాగ్రత్తలు లేకుండా తమను మంటల వద్దకు పంపుతున్నారని ఫైర్ వాచర్లు వాపోతున్నారు. భారీ ఎత్తున మంటలు చెలరేగుతుండటంతో చెంచు యువకుడు పోతయ్య కాలికి గాయమైందని వారు ఆరోపించారు. సరైన రక్షణతోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలని వాచర్లు కోరుతున్నారు. ఆకురాల్చే సమయం కావడం, అడవి గుండా శ్రీశైలం రహదారి ఉండటంతో అటుగా వెళ్లే ఆకతాయిలు చేస్తున్న పనుల వల్ల మంటలు చెలరేగుతున్నాయని డీఎఫ్వో రోహిత్ గోపిడి తెలిపారు. రోడ్డుకిరువైపులా రాలి ఉన్న ఎండుటాకులను 20 మీటర్ల మేర తొలగించి కాలుస్తున్నామని పేర్కొన్నారు. ఫైర్ సిబ్బంది రక్షణ కోసం ఇనుప బూట్లు, ఎయిర్బ్లోర్స్, ప్రత్యేక మాస్కులు తదితర ఫైర్ సేఫ్టీ వస్తువులు అందజేశామని తెలిపారు.