హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర అర్థగణాంక శాఖ (డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్) కొత్త జవసత్వాలను సమకూర్చుకోనున్నది. ఈ శాఖలో 166 కొత్త పోస్టులు సృష్టించేందుకు రాష్ట్ర క్యాబినెట్ తాజాగా ఆమోదం తెలిపింది. క్యాబినెట్ నిర్ణయం రాష్ట్ర ఆర్థిక, సామాజిక డాటా సేకరణ, విశ్లేషణ సామర్థ్యాన్ని మరింత పటిష్ఠం చేస్తుందని అధికారవర్గాలు తెలిపాయి.
ఈ కొత్త పోస్టుల ద్వారా అర్థగణాంక శాఖలో మానవ వనరుల లోటును తీర్చడంతోపాటు డాటా నాణ్యత, విశ్వసనీయత మరింత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. వీటిలో 36 పోస్టులను అప్గ్రేడ్, ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. ఈ పోస్టుల నియామకాలకు సంబంధించిన జీవో ఒకటి నుంచి రెండు నెలల్లో రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. జీవో జారీ అయిన తర్వాత నియామక ప్రక్రియ నోటిఫికేషన్ విడుదల కానున్నది. టీజీపీఎస్సీ ద్వారా వివిధ ప్రక్రియల్లో అర్హత కలిగిన అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.