హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): ఎన్నికల హామీలను అమలు చేయాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం సీపీఎం సీనియర్ నేత చెరుపల్లి సీతారాములు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో పలు తీర్మానాలు ఆమోదించారు.
ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12 వేలు, మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో 20 లక్షల మందికిపైగా కౌలురైతులు 30 శాతానికి పైగా వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు. కౌలు రైతులకు 2011 చట్టప్రకారం లోన్ ఎలిజిబులిటీ కార్డులు ఇవ్వాలని, ధరణి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో పంటలబీమా ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లించాలని, దొడ్డు బియ్యం, ఇతర పంటలకూ బోనస్ ఇవ్వాలని కోరారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలని, జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. పేదలందరికీ ఇందిరమ్మ పథకం కింద ఆర్థిక సహాయం చేయాలని విన్నవించారు.
అటవీ హకుచట్టం ప్రకారం అర్హులైనందరికీ హకుపత్రాలు ఇవ్వాలని అన్నారు. ఉద్యోగుల బకాయిలు, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పంచాయతీ కార్మికులు, మున్సిపల్ కార్మికులు, ప్రభుత్వ హాస్పిటల్స్ కాంట్రాక్ట్ కార్మికులు, 104 ఉద్యోగులకు వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని, ధరలకు అనుగుణంగా జీతాలను సవరించాలని కోరారు. సమావేశంలో నేతలు వీరభద్రం, రంగారెడ్డి, నర్సింహారెడ్డి, వీరయ్య, జ్యోతి, సాగర్ ఉన్నారు.