ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 31: కదులుతున్న బస్సులో లైంగికదాడికి పాల్పడిన బస్సు డ్రైవర్ సహా మరో డ్రైవర్‌నూ 24 గంటల్లోగా అదుపులోకి తీసుకున్నట్టు హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి వెల్లడించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఏసీపీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు.
హరికృష్ణ ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్ బస్సు నిర్మల్ నుంచి పామూరుకు సోమవారం సాయంత్రం డ్రైవర్లు ఈర్ల కృష్ణబాబు (31), రామగిరి సిద్ధయ్య (32)తో బయలుదేరిందని తెలిపారు. అదే బస్సులో బాధితురాలు (25) ఎనిమిదేళ్ల కుమార్తెతో కలిసి వెళ్తుండగా, మెదక్ జిల్లా చేగుంట సమీపంలో రాత్రి భోజనం కోసం బస్సును నిలిపారని చెప్పారు. తిరిగి బస్సు బయలుదేరుతుండగా, బస్సు డ్రైవర్ కృష్ణ బాధితురాలి వద్దకు వచ్చి బెర్త్ నంబర్ 5, 6కు వెళ్లాలని సూచించడంతో ఆ బెర్త్‌కు మారినట్టు వివరించారు.
అర్ధరాత్రి బాధితురాలు గాఢనిద్రలోకి వెళ్లగానే గమనించిన నిందితుడు కృష్ణ బలవంతంగా బెడ్‌షీట్‌ను ఆమె నోట్లో కుక్కి, లైంగికదాడికి పాల్పడ్డాడని వివరించారు. బాధితురాలి కేకలతో మరో డ్రైవర్ సిద్ధయ్య సహాయం తో కృష్ణ పరారయ్యాడు. తోటి ప్రయాణికుల సహాయం తో బాధితురాలు 100కు ఫోన్ చేయగా పోలీసులు బస్సును నిలిపి, బాధితురాలిని వైద్యపరీక్షల నిమిత్తం దవాఖానకు తరలించినట్టు తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. సమావేశంలో ఏసీపీ గ్యార జగన్, సీఐ ఎన్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.