సిరిసిల్ల రూరల్, మే 14: శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పోలీసుశాఖకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని డీజీపీ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న జిల్లా పోలీసు కార్యాలయాల భవనాల సముదాయాన్ని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్‌గుప్తా, మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్‌కుమార్ జైన్‌తో కలిసి డీజీపీ సందర్శించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని పోలీస్స్టేషన్లకు భవనాలు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. నూతన జిల్లాల్లో మొదటగా డీపీవో భవనాలు పూర్తి చేసిన తర్వాత పోలీస్స్టేషన్ల భవనాలు అవసరమయిన చోట గుర్తించి నిర్మిస్తామని చెప్పారు. అనంతరం వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని పూజలు చేశారు.