బంజారాహిల్స్, ఏప్రిల్ 18: హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని బీఎస్‌డీఏవీ స్కూల్లో నాలుగున్నరేండ్ల చిన్నారిపై లైంగికదాడికి పాల్పడిన డ్రైవర్ భీమన రజినీకుమార్ (34) కు నాంపల్లి ప్రత్యేక పోక్సో కోర్టు 20 ఏండ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ కేసులో స్కూల్ ప్రిన్సిపాల్ మాధవిని న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది. ఆరు నెలల్లోనే నిందితుడికి శిక్ష విధించడం విశేషం. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 14లోని డీఏవీ ప్రైవేటు స్కూల్లో ఎల్కేజీ చదువుతున్న బాలికపై అదే స్కూల్లో డ్రైవర్‌గా పనిచేస్తున్న భీమన రజినీకుమార్ (34) గత ఏడాది అక్టోబర్‌లో లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న బాలిక తల్లిదండ్రులు అక్టోబర్ 18న స్కూల్ వద్దకు చేరుకుని నిందితుడికి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. స్కూల్ ప్రిన్సిపాల్ మాధవి కారు డ్రైవర్‌గా పనిచేసే రజనీకుమార్ స్కూల్ మొత్తం తిరుగుతూ చిన్నారులను వేధింపులకు గురిచేసేవాడని, స్కూల్లోని డిజిటల్ క్లాస్‌రూమ్‌లో చిన్నారిపై అఘాయిత్యం చేశాడని బాలిక తండ్రి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో రజినీకుమార్తోపాటు స్కూల్ ప్రిన్సిపాల్ మాధవిపై ఐపీసీ 376(ఏబీ) రెడ్‌విత్ 5(ఎమ్), 21 ఆఫ్ పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో పక్కా ఆధారాలతో బంజారాహిల్స్ పోలీసులు నాంపల్లిలోని ప్రత్యేక పోక్సో న్యాయస్థానంలో చార్జిషీటు దాఖలు చేశారు. కేసును విచారించిన న్యాయస్థానం కేసులో నిందితుడు రజినీకుమార్‌ను దోషిగా తేల్చింది. అతడికి 20 ఏండ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ మంగళవారం తీర్పును వెలువరించింది. కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ప్రిన్సిపాల్ మాధవిని నిర్దోషిగా ప్రకటించింది.
దర్యాప్తు అధికారులకు సీపీ సీవీ ఆనంద్ అభినందన
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): బీఎస్‌డీఏవీ స్కూల్లో చిన్నారిపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడికి ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్డు 20 ఏండ్ల జైలు శిక్ష విధించడంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ హర్షం ప్రకటించారు. కేసు దర్యాప్తును వేగంగా పూర్తి చేసి, న్యాయస్థానం ముందు సాక్ష్యాధారాలను ఉంచడంతోపాటు బలంగా వాదనలు వినిపించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లను సీపీ అభినందించారు. ఈ తీర్పు సమాజంలో మరింత విశ్వాసాన్ని నింపుతుందని చెప్పారు. ఈ కేసు దర్యాప్తులో పాల్గొన్న సిబ్బందిని బంజారాహిల్స్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు పిలిపించి మంగళవారం వారికి మెమొంటోలు అందించారు.