సికింద్రాబాద్, మే 8: చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి దారుణ హత్య జరిగింది. యవన్ అలియాస్ అఖిల్ (20) అనే యువకుడిని నలుగురు వ్యక్తులు కత్తులతో పొడిచి చంపారు. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. హత్య విషయం తెలుసుకున్న యువకుడి బంధువులు, మృతుడి తండ్రి శ్రీనివాస్, తల్లి అన్నపూర్ణ, ఇతర కుటుంబ సభ్యులు మేడిబావిలోని యువతి నివాసం వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. అల్వాల్‌కు చెందిన అఖిల్ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. గతంలో సీతాఫల్మండిలోనే ఉన్న అతని కుటుంబసభ్యులు రెండేండ్ల క్రితం అల్వాల్‌కు మారారు. అఖిల్ మేడిబావికి చెందిన ఓ యువతిని ప్రేమించినట్టు తెలుస్తున్నది. తరచుగా అల్వాల్ నుంచి సీతాఫల్‌మండికి చెందిన స్నేహితుడి ఇంటికి వచ్చేవాడు. గురువారం రాత్రి అలాగే వచ్చి స్నేహితుడి నివాసం వద్ద ఉండగా నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి దారుణంగా కత్తులతో పొడిచి పారిపోయారు. వెంటనే గాంధీ దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ యవన్ కుటుంబసభ్యులు రహదారిపై ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. వాతావరణం ఉద్రిక్తంగా మారడంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. యువతి ఇంటి ముందు కూడా మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.
నిందితులను త్వరలోనే పట్టుకుంటాం: అడిషనల్ డీసీపీ నర్సయ్య
యవన్ అలియాస్ అఖిల్ ఓ యువతి ప్రేమించుకుంటున్నట్టు తెలిసిందని, దీనిపై ఇరు కుటుంబాల మధ్య గతంలో గొడవలు జరిగాయని సికింద్రాబాద్ జోన్ అడిషనల్ డీసీపీ నర్సయ్య చెప్పారు. పెద్ద మనుషుల వద్ద రాజీ కుదరడంతో అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు. హత్య వెనుక మరేదైనా కుట్ర ఉన్నదా? అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నామని, హంతకులను త్వరలోనే పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అడిషనల్ డీసీపీ నర్సయ్య, చిలకలగూడ ఏసీపీ శశాంక్‌రెడ్డి, చిలకలగూడ సీఐ ఒలిశెట్టి రామకృష్ణ పేర్కొన్నారు.
అఖిల్, యువతి ఫోన్ ఆడియో కాల్ వైరల్
కొద్ది రోజుల క్రితం అఖిల్, యువతి మధ్య ఫోన్ కాల్లో జరిగిన సంభాషణల ఆడియో రికార్డు వెలుగులోకి వచ్చింది. చెప్పిన మాట వినకపోతే ఇద్దరినీ చంపేస్తామని, నీపై తప్పుడు కేసు పెట్టాలని ఒత్తిడి తెస్తున్నారని ఆ యువతి అఖిల్‌తో చెప్తున్నట్టుగా రికార్డయ్యింది. కేసు పెట్టకపోతే ఇద్దరినీ బతుకనివ్వబోమని బెదిరస్తున్నారని చెప్పింది. ఇందుకు అఖిల్ స్పందిస్తూ మొన్ననే కాంప్రమైజ్ అయ్యాము కదా.. మళ్లి పోలీస్ కేసేమిటి? నాతో మాట్లాడొచ్చుకదా? అని జవాబిచ్చినట్టు ఆడియోలో వినిపిస్తున్నది. దీంతో పథకం ప్రకారమే అఖిల్‌ను హత్యచేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.