Telangana | జైనూర్, సెప్టెంబర్ 3: ఒంటరిగా ఊరెళ్తున్న ఆదివాసీ మహిళపై ఓ వ్యక్తి లైంగికదాడికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో హత్యాయత్నం చేసి తీవ్రంగా గాయపర్చి పారిపోయాడు. మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం దేవుగూడ శివారులో చోటుచేసుకుంది.
దేవుగూడకు చెందిన ఆదివాసీ మహిళ సోదరులకు రాఖీ కట్టేందుకు గత నెల 31న సిర్పూర్(యు) మండలంలోని కోహినూర్‌కు వెళ్లడానికి ఆటోల కోసం జైనూర్‌లో ఎదురుచూస్తున్నది. ఈ విషయాన్ని గమనించిన సోను పటేల్.. గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ షేక్ మగ్దూం కోహినూర్‌కు వెళ్తున్నట్టు ఆమెను నమ్మించి ఆటో ఎక్కించాడు. షేక్ ముగ్దూం రాఘాపూర్ దాటగానే ఒంటరిగా ఉన్న మహిళతో అసభ్యకరంగా మాట్లాడుతూ లైంగికదాడికి యత్నించాడు. ఆమె కేకలు వేయడంతో వాగ్వాదానికి దిగాడు. ఈ విషయం బయటికి వెళ్తే తనపై దాడి చేస్తారనుకున్న షేక్ ముగ్దూం.. ఆమె ముఖంపై ఇనుపరాడుతో బలంగా కొట్టాడు. ఆమె స్పృహ తప్పి పడిపోయింది. మహిళ చనిపోయిందనుకుని రోడ్డుపై పడేసి ఆటో డ్రైవర్ పారిపోయాడు.
అటుగా వస్తున్న వాహనదారులు రక్తపు మడుగులో పడి ఉన్న మహిళను గమనించి 108లో జైనూర్ సర్కారు దవాఖానకు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఆదిలాబాద్ రిమ్స్‌కు, అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయిందని బాధితురాలి తమ్ముడు ఈ నెల 1న సిర్పూర్(యు) పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న బాధితురాలు స్పృహలోకి రావడంతో అసలు విషయం బయట పడింది. ఈ నెల 2న పోలీసులు ఆమెను విచారించగా.. తనపై ఆటో డ్రైవర్ షేక్ మగ్దూం లైంగిక దాడి చేయడానికి యత్నించాడని, తాను ఎదురు తిరిగితే.. తన ముఖంపై ఇనుపరాడుతో బలంగా కొట్టాడని వివరించింది. నిందితుడిపై లైంగికదాడి, హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్టు ఆసిఫాబాద్ డీఎస్పీ సదయ్య, జైనూర్ సీఐ రమేశ్ తెలిపారు. ఆదివాసీ మహిళపై లైంగికదాడి, హత్యాయత్నానికి పాల్పడిన షేక్ మగ్దూంను బహిరంగంగా ఉరి తీయాలని ఆదివాసీ సంఘాల జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కనకయాదవ్‌రావ్ డిమాండ్ చేశారు. ఆదివాసీ మహిళపై జరిగిన అఘాయిత్యాన్ని నిరసిస్తూ మంగళవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు.